ఆరిపోయిన అక్షర దీపం | - | Sakshi
Sakshi News home page

ఆరిపోయిన అక్షర దీపం

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

ఆరిలోవ(విశాఖ) : ఉదయం లేచి బడికి వెళ్లడం.. చిన్నారులకు అక్షరాలు నేర్పడం.. వారి భవిష్యత్తుకు బాటలు వేయడం.. ఇదే ఆమె దినచర్య. మారుమూల గిరిజన ప్రాంతంలోని పిల్లలకు విద్య అందించాలన్న తపనతో ప్రతిరోజూ విశాఖ నుంచి అనంతగిరి కొండల వరకు ప్రయాణం చేసేవారు. కానీ అదే ప్రయాణం ఆమె జీవితానికి చివరి ప్రయాణమవుతుందని ఎవరూ ఊహించలేదు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ మాడ్రెబు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జాగారపు సునీత(44) శనివారం పినకోట వద్ద జరిగిన జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుడు ఘటనలో మృతి చెందారు. నగరంలోని విశాలాక్షినగర్‌లో కుటుంబంతో నివసిస్తున్న ఆమె ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులతో పాటు సహచర ఉపాధ్యాయులను తీవ్ర విషాదంలో ముంచింది. సునీత గతంలో ఆరిలోవ తోటగరువు సమీపంలోని గాంధీనగర్‌ ప్రాథమిక పాఠశాలలో రెండేళ్లపాటు పనిచేశారు. 2024లో ఆమెకు అనంతగిరి మండలం మాడ్రెబు పాఠశాలకు బదిలీ అయింది. దూర ప్రాంతం అయినప్పటికీ విధి పట్ల అంకితభావంతో ప్రతిరోజూ విశాఖ నుంచి పాఠశాలకు వెళ్లి వచ్చేవారు. విశాఖ నుంచి దేవరాపల్లి వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి.. అక్కడి నుంచి మాడ్రెబు వరకు ఆటోలో వెళ్లేవారు. ఆ మారుమూల ప్రాంతంలోని విద్యార్థులకు పాఠాలు చెప్పడమే తన బాధ్యతగా భావించారు. అయితే రెండు రోజులుగా ఆమెకు అలవాటైన ఆటో డ్రైవర్‌ రాకపోవడంతో శనివారం మరో వాహనంలో పాఠశాలకు బయలుదేరారు. మార్గంమధ్యలో జిలెటిన్‌ స్టిక్స్‌ పేలి ఆమె ప్రాణాలు కోల్పోయారు.

‘మేడమ్‌ మాటలు..

పిల్లలపై ప్రేమ గుర్తొస్తున్నాయి’

గాంధీనగర్‌ పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు సునీత మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘పిల్లలంటే ఆమెకు ఎంతో ప్రేమ. ఉత్సాహంగా బోధించేవారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆమె ఇచ్చిన ప్రసంగం ఇప్పటికీ గుర్తుంది’.. అంటూ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.భర్త, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తెతో సంతోషంగా సాగుతున్న కుటుంబంలో ఆమె మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లలకు వెలుగు పంచేందుకు వెళ్లిన ఓ ఉపాధ్యాయురాలి జీవితం.. ఓ ప్రమాదంలో ఆరిపోవడం అందరినీ కలచివేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement