కాపులకు బీసీ ధ్రువపత్రాలపై జనసేన అభ్యంతరం | - | Sakshi
Sakshi News home page

కాపులకు బీసీ ధ్రువపత్రాలపై జనసేన అభ్యంతరం

Oct 25 2026 1:05 AM | Updated on Oct 25 2026 1:05 AM

● వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ నామినేషన్‌ తిరస్కరణకు అధికారులపై ఒత్తిడి ● అధికారులను నిలదీసిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌

మునగపాక : అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వైఎస్సార్‌సీపీకి చెందిన నాగవరం ఎంపీటీసీ పాలిపిని రామలక్ష్మి నామినేషన్‌ను తిరస్కరిస్తున్నారన్న సమాచారంతో వైఎస్సార్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున నామినేషన్‌ కేంద్రానికి తరలివచ్చారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధం కాగా, ఎస్‌ఐ ప్రసాదరావు జోక్యం చేసుకొని నామినేషన్‌ తిరస్కరణ కాకుండా చర్యలు తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నాగవరం ఎంపీటీసీ సెగ్మెంట్‌ను బీసీలకు కేటాయించారు. పాత నాగవరం గ్రామానికి చెందిన పాలిపిని రామలక్ష్మి తన నామినేషన్‌లు దాఖలు చేశారు. శనివారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనలో భాగంగా జనసేన నాయకులు కలుగజేసుకొని కాపులకు బీసీ ధ్రువీకరణ పత్రం పేరిట నామినేషన్‌ ఎలా వేస్తారంటూ అభ్యంతరం తెలిపారు. అధికార పార్టీకి చెందిన పెద్దల ద్వారా నామినేషన్‌ను తిరస్కరించాలంటూ ఆర్‌వోపై ఒత్తిడి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, పార్టీ శ్రేణులు నామినేషన్‌ కేంద్రానికి చేరుకొని నామినేషన్‌ పరిశీలన పూర్తయినా ఇంతవరకు నోటీసు బోర్డులో ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు. అక్కడ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వెళ్లి ఆర్‌డీవో దృష్టికి సమస్య తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. వివాదం పెరుగుతుండడంతో ఎస్‌ఐ పి.ప్రసాదరావు స్థానిక వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అధికారులతో చర్చించారు. నిబంధనల మేరకు అధికారులు వ్యవహరించాలని ప్రసాద్‌ తదితరులు కోరడంతో సాయంత్రం నోటీసు బోర్డులో నామినేషన్ల జాబితాను ఎన్నికల ఽఅధికారి ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ నామినేషన్‌ కేంద్రం వద్దకు చేరుకొని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు.

కూటమి కుతంత్రాలు సిగ్గుచేటు : బొడ్డేడ ప్రసాద్‌

వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి రామలక్ష్మి నామినేషన్‌ను తిరస్కరించేందుకు అధికార పార్టీ నేతలు కుట్రలు చేయడం సరికాదని వైఎస్సార్‌సీపీ జిల్లా ఽఅధ్యక్షుడు ప్రసాద్‌ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2019లో జిల్లా వ్యాప్తంగా కాపు సోదరులకు బీసీ ధ్రువీకరణ పత్రాలు అందించారన్నారు. ప్రభుత్వాలు మారినా వారికి వెసులుబాటు కల్పించేలా కాపులకు బీసీ ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించుకుంటున్నారన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఈ ధ్రువీకరణ పత్రాలపై అభ్యంతరం చెప్పడం, జనసేన నాయకులు కుతంత్రాలు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్‌ ఆడారి అచ్చియ్యనాయుడు,మాజీ ఎంపీపీ దాసరి గౌరీలక్ష్మి అప్పారావు,వెంకటాపురం మాజీ సర్పంచ్‌ సుందరపు తాతాజీ, వెంకట్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement