● కొమరవోలులో రాజకీయంగా ఆసక్తికర పరిణామం
కొమరవోలు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సామిరెడ్డి దుర్గావరలక్ష్మి నామినేషన్ ర్యాలీలో జనసేన, టీడీపీ జెండాలతో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
రోలుగుంట: మండలంలోని కొమరవోలు ఎంపీటీసీ ఎన్నికల్లో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సామిరెడ్డి దుర్గావరలక్ష్మికి స్థానికంగా జనసేన, టీడీపీలకు చెందిన పలువురు నాయకులు మద్దతు ప్రకటించారు. బుధవారం ఆమె నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ నాయకులు బోళెం దొరబాబు, సామిరెడ్డి రామ్మూర్తి నాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివెళ్లాయి. జనసేన నాయకులు ఇట్టశెట్టి జగునాయుడు, బండారు దొరబాబు తమ పార్టీ కార్యకర్తలతో పాల్గొని మద్దతు తెలిపారు. టీడీపీ నాయకుడు బోళెం గిరిబాబు సైతం తన అనుచరులతో ర్యాలీలో పాల్గొనడం స్థానికంగా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రామంలో బోళెం కుటుంబాలకు గణనీయమైన సంఖ్యాబలం ఉంది. ఇప్పటి వరకు ఆ కుటుంబాలకు చెందిన వారు వివిధ రాజకీయ పార్టీల్లో కొనసాగినప్పటికీ, ప్రస్తుత ఎన్నికల్లో ఐక్యంగా నిలిచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం విశేషంగా మారింది. ఈ పరిణామం దుర్గావరలక్ష్మి విజయావకాశాలకు కలిసివస్తుందని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా కొమరవోలులో వివిధ పార్టీల నాయకులు ఒకే అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొనడం ఎన్నికల రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


