ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్యలక్ష్మి
రోలుగుంట: పోషక విలువలతో కూడిన ఆహారం చిన్నారులకు అందజేసి వారి ఎదుగుదలకు అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.రాజ్యలక్ష్మి అన్నారు. మండలస్థాయిలో రావికమతం ఐసీడీఎస్ సీడీపీవో మంగతాయారు రోలుగుంటలో గల బుచ్చింపేట, రోలుగుంట సెకార్లు సూపర్‌వైజర్లు హేమ, బేగం, వారి పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లతో కలసి పోషణ్ మాసం– 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ పాల్గొన్న జిల్లా పీడీ తమ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందిస్తున్న సమతుల్య ఆహారం గురించి అవగాహన కల్పించారు. కేంద్రాలకు వస్తున్న చిన్నారుల ఆరోగ్యం, వారి ఎదుగుదలపై ఆయా కేంద్రాల టీచర్లు బాధ్యత వహించాలన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు తక్కువ ఖర్చుతో తయారు చేసిన పోషక విలువలు కలిగిన వంటకాలు ప్రదర్శించారు. వాటిని ఎంపీడీవో వి.ఎస్.నాగేశ్వరరావు, తహసీల్దార్ నాగమ్మ, నాయకులు గుములూరి చంద్రమౌలి, పంచాడ నాగచంద్ర, ఆడారి గణేశ్వరరావుతో తదితరులు రుచి చూసి అభినందించారు. మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో గల బాలింతలు, గర్భిణులు, కిశోర బాలికలు, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.


