కలెక్టరేట్ వద్ద బౌద్ధ సంఘాల నిరసన
తుమ్మపాల: అనకాపల్లి మండలం శంకరం గ్రామంలోని ప్రముఖ బౌద్ధ పర్యాటక కేంద్రమైన బొజ్జన్నకొండ పేరును ‘బుద్ధునికొండ’గా మార్చాలని ఉభయ విశాఖ జిల్లాల బౌద్ధ సంఘాల సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ గేటు వద్ద ఫ్లెక్సీలతో నిరసన ప్రదర్శన చేసి డీఆర్‌వో వై. సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బౌద్ధ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బోర వేణుగోపాల్ గౌతమ్ మాట్లాడుతూ శంకరంలో బొజ్జన్నకొండగా పిలవబడే బౌద్ధ క్షేత్రానికి ప్రాచీన చరిత్ర ఉందని, బుద్ధుని విగ్రహాలు, స్తూపాలు, చైత్యాలు, గుహలు బౌద్ధ అవశేషాలు అత్యంత ప్రాచుర్యం కలిగినవన్నారు. బొజ్జన్నకొండ పేరుతో ప్రజల్లో, పర్యాటకుల్లో కొంత అయోమయం నెలకొంటోందని, బుద్ధునికొండగా పేరు మార్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుని అధికారికంగా ప్రకటించాలని కోరారు. సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బల్లా నాగభూషణం మాట్లాడుతూ బౌద్ధ సంప్రదాయానికి సంబంధించిన చారిత్రక అవశేషాలతో ఉన్న ఈ ప్రాంతానికి బుద్ధునికొండ అనే పేరు మరింత సముచితంగా ఉంటుందని అన్నారు. బౌద్ధ క్షేత్రంలోని స్తూపాలు, చైత్యాలను ఇతర పేర్లతో పిలవడం వల్ల దాని చారిత్రక, బౌద్ధ ప్రాధాన్యం మరుగున పడుతోందన్నారు. బౌద్ధ క్షేత్ర ప్రతిష్ట, చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటేలా పేరు మార్పు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు వి.వి.దుర్గారావు, గునుపూడి బాబులు, పల్లా బాబ్జి, నేలపూడి బాలరాజు, మట్టా కృష్ణారెడ్డి, గుడాల అచ్యుతరామారావు, ఎస్.దయాళ్‌రాజు, ఎస్.జాన్‌బాబు, పందిరి ధవళరాజు, గిలకల అప్పారావు, కాపారపు సత్యనారాయణ పాల్గొన్నారు.


