గడువులోగా జేజేఎం పనులు పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా జేజేఎం పనులు పూర్తి చేయండి

Oct 1 2026 4:58 AM | Updated on Oct 1 2026 4:58 AM

కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశాలు

తుమ్మపాల: జల్‌జీవన్‌మిషన్‌ (జేజేఎం) కింద మంజూరైన తాగునీటి పథకాల పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో జేజేఎం పనుల పురోగతి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు ఉన్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తయినందున ఇక పనుల్లో జాప్యాన్ని సహించేది లేదన్నారు. నిలిచిపోయిన పనులను వెంటనే పునఃప్రారంభించి, ప్రారంభమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. డివిజనల్‌ ఇంజినీర్లు, అసిస్టెంట్‌ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటించి పనుల వేగం, నాణ్యతను పరిశీలించాలన్నారు. జిల్లాలో జేజేఎం కింద రూ.675.95 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 886 పనులు మంజూరయ్యాయని తెలిపారు. జేజేఎంతో పాటు ఇంటింటి మరుగుదొడ్ల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ, డీఈలు, జేఈలు, ఈఈలు పాల్గొన్నారు.

పింఛన్ల పంపిణీలో పారదర్శకత

అనకాపల్లి: పింఛన్ల పంపిణీ పారదర్శకంగా, వేగవంతంగా జరగాలని, సంబంధిత అధికారులకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌పటేల్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబర్‌ 1 నుంచి సంక్షేమ దినోత్సవం సందర్భంగా పింఛన్ల పంపిణీ, క్షేత్రస్థాయి విధులపై ప్రభుత్వ ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. గతంలో ఒక డిజిటల్‌ అసిస్టెంట్‌ నకిలీ బ్యాంక్‌ స్టాంప్‌, రశీదులతో రూ.1.5 లక్షల నిధులను దుర్వినియోగం చేసినందుకు అతనిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టి సస్పెండ్‌ చేయడం జరిగిందని, క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన లేకుండా నివేదికలు సమర్పించే అధికారులపై కూడా భవిష్యత్తులో సహ–నిందితులుగా కేసు నమోదు చేసి తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. మే నుంచి సెప్టెంబర్‌ వరకు వరుసగా ప్రతికూల అభిప్రాయాలు వచ్చిన నక్కపల్లి, కె.కోటపాడు, మాకవరపాలెం, చీడికాడ, కోటవురట్ల, అచ్యుతాపురం, నాతవరం, రోలుగుంట మండలాలపై మండల నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సాఽరించాలన్నారు. జిల్లాలో దాదాపు 4,867 మంది లబ్ధిదారుల మొబైల్‌ నంబర్లు ఇంకా డేటాబేస్‌లో అప్‌డేట్‌ కాలేదని, మండలాల వారీగా ఈ రిపోర్టును ఎంపీడీవో గ్రూప్‌లో షేర్‌ చేస్తామని, కేటాయించిన సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఫోన్‌ నంబర్లను సేకరించి అప్‌డేట్‌ చేయించాలన్నారు.

పారిశ్రామిక ప్రమాదాలు నివారించాలి

జిల్లాలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు అధికారులు తరచూ సేఫ్టీ ఆడిట్లను నిర్వహించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం తమ కార్యాలయలో డిస్ట్రిక్ట్‌ క్రైసిస్‌ గ్రూప్‌తో సమీక్ష సమావేశం జరిగింది. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశ్రామిక భద్రత, అత్యవసర పరిస్థితులు, రసాయన, పారిశ్రామిక ప్రమాదాల నివారణ, విపత్తు నిర్వహణ చర్యలపై అధికారులు సేఫ్టీ ఆడిట్లను నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ఆఫ్‌సైట్‌ ఎమర్జెన్సీ ప్లాన్‌’ పూర్తిచేయాలని, వెండర్స్‌ ఖరారు చేసి, పర్చేజ్‌ ఆర్డర్‌ ప్రపోజల్‌ను ఫ్యాక్టరీస్‌ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, భద్రతా నిపుణులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement