కూటమి మోసంపై పెల్లుబికిన ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

కూటమి మోసంపై పెల్లుబికిన ఆగ్రహం

Oct 1 2026 4:58 AM | Updated on Oct 1 2026 4:58 AM

ఆడపిల్లలంటే అంత అలుసా ప్యాకేజీపై హామీ ఇచ్చి మోసం చేస్తారా?
ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకపోతే పోరాటం తప్పదు చంద్రబాబు సర్కారుపై ధ్వజమెత్తిన మిట్టల్‌ స్టీల్‌ నిర్వాసితులు

తహసీల్దార్‌ కార్యాలయం వద బైఠాయించిన నిర్వాసితులు

ఇల్లు లేదు..ఉపాధి కూడా లేదు

నక్కపల్లి: స్టీల్‌ప్లాంట్‌, బల్క్‌ డ్రగ్‌పార్క్‌ కోసం ప్రభుత్వం వేంపాడు, చందనాడ, బుచ్చిరాజుపేట, రాజయ్యపేట, అమలాపురం పాటిమీద, మూలపర గ్రామాల్లో 4500 ఎకరాలు ఏపీఐఐసీ ద్వారా సేకరించారు. వీటిలో ఆర్సిలర్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌కు 2200 ఎకరాలు, బల్క్‌డ్రగ్‌ పార్క్‌కు 2 వేల ఎకరాలు కేటాయించారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం కేటాయించిన భూముల్లో పాటిమీద, మూలపర, తమ్మయ్యపేట గ్రామాలున్నాయి. వీటిలో సుమా రు 1000 మంది వరకు నివసిస్తున్నారు. ఇక్కడ 850 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం జాబితా సిద్ధం చేసింది. వీరి ఇళ్లను ఖాళీ చేయించి బోదిగ్లల్లం వద్ద పునరావాసకాలనీ ఏర్పాటు చేశారు. అక్కడ వీరందరికి ఐదుసెంట్ల ఇంటి స్థలం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.9.80లక్షలు చెల్లించారు. నివాస ప్రాంతాలను ఖాళీ చేయించే సమయంలో ప్రభుత్వం యజమానితోపాటు, మేజర్లయిన కొడుకులు, వివాహాలు కాని ఆడపిల్లలకు ఇంటి స్థలం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో నిర్వాసితులు తమ ఇళ్లను తొలగించేందుకు అంగీకరించారు. తీరా ఇళ్లు తొలగించిన తర్వాత నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం చేసింది. ఒక ఇంట్లో యజమాని ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉంటే మగవారికి మాత్రమే నష్టపరిహారం, ప్యాకేజీ ఇచ్చి మిగిలిన వారికి మొండిచేయి చూపించింది. వివాహాలైన ఆడపిల్లలకు నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేసింది.

నాటి హామీలేమయ్యాయి...?

2014లో భూములు స్వాధీనం చేసుకునే సమయంలో నిర్వాసిత కుటుంబాల్లో వివాహాలు కాని ఆడపిల్లలకు ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. 2024లో అధికారంలోకి వచ్చేక భూములు స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టారని అలాగే గత ఏడాది స్టీల్‌ప్లాంట్‌కు భూములు కేటాయించిన తర్వాత నివాస ప్రాంతాలు కూడా తొలగిస్తున్నారని నిర్వాసితులు తెలిపారు. ఇప్పుడు ప్యాకేజీ ఇవ్వాలని కోరితే ప్రభుత్వం, అధికారులు ఏ సమాధానం చెప్పడం లేదంటూ బాధితులు కన్నీటి పర్యంత మవుతున్నారు. ఇంట్లో ఇద్దరు కొడుకులు ఒకరికే ప్యాకేజీ ఇచ్చారని, ఇంటి యజమానికి నష్టపరిహారం ఇచ్చాం కాబట్టి ఇళ్లు ఖాళీ చేయాల్సిందేనంటూ బెదిరించి ఒత్తిడి తెచ్చి ఖాళీ చేయించారని వారు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వం ఇచ్చిన హమీలో ఆర్‌ఆండ్‌ ఆర్‌ప్యాకేజీకి అర్హత ఉన్న ఆడపిల్లలు సుమారు 250 మంది ఉన్నారు. వీరందరికి వివాహాలయ్యాయి. ఆర్‌అండ్‌ ఆర్‌ప్యాకేజీని లాంఛనాలు కింద ఆశ చూపించి వివాహాలు చేసామని తీరా ఇప్పుడు ప్రభుత్వం వీరికి నష్టపరిహారం చెల్లించకపోవడంతో అత్తింటి వారితో ఇబ్బందులు వస్తున్నాయంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇళ్లు కూల్చే సమయంలో నిర్వాసిత కుటుంబాల్లో అనారోగ్యంతో మంచాన పడిన వారు ఉన్నారని వారి పట్ల కనికరం లేకుండా గడువు ఇవ్వకుండా పొక్లెయిన్‌లతో ఇళ్లు కూల్చేశారని తెలిపారు. రెండేళ్ల నుంచి కలెక్టర్‌, ఆర్‌డీవో, ఏపీఐఐసీ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వివాహం కాని ఆడపిల్లలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇప్పిస్తానని హోంమంత్రి కూడా హామీ ఇచ్చి, నిలబెట్టుకోలేదన్నారు. ప్రభుత్వం చేసిన మోసంతో రగిలిపోతున్న వీరంతా బుధవారం స్టీల్‌ప్లాంట్‌ రోడ్డు ఎదుట ధర్నాకు దిగారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆపే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఆందోళనకు వైఎస్సార్‌సిసీపీ, రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, నాయకత్వం వహించారు. మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గొర్ల గోవిందు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి సూరాకాసుల గోవిందు, మాజీ వైస్‌ ఎంపీపీ వీసం నానాజీ, నిర్వాసిత నాయకులు తళ్ల భార్గవ్‌, అప్పలరాజు, గంటా తిరుపతిరావు, రావి చిన్ని, ఎం.గోవిందు, పిక్కితాతీలు, నూకరాజు పాల్గొన్నారు.

నాకు కూల్చేసిన ఇంటికి నష్టపరిహారం ఇచ్చారు. స్థలానికి డబ్బులు ఇవ్వలేదు. ఎంత దారుణం. స్థలానికి డబ్బులు ఇవ్వాలని రెండేళ్ల నుంచి తిరుగుతున్నాను పట్టించుకోలేదు. ఉన్న పళంగా ఊరొదిలేసి పోయాం ఎలా బతుకుతాం. కాటికి కాలు చాచిన వయసులో ఇలా బాధపెట్టడం ఎంత వరకు సమంజసం. చంద్రబాబు మాటలు నమ్మి సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాం. ఇలా సేత్తాడని అనుకోలేదు. –రావి నూకరాజు, పాటిమీద

వివాహాలు కాని ఆడపిల్లలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసింది. పెళ్లిళ్లు అయిపోయాయని చెప్పి ఇవ్వడం మానేసింది. ప్రభుత్వ హామీని నమ్మి బాధితులంతా ఇళ్లు ఖాళీ చేయడానికి ఒప్పుకున్నా రు. ఇళ్లు కూల్చేసి వారందరినీ కట్టుబట్టలతో తగిలేశారు. ఇప్పుడు పరిహారం ఇవ్వమంటున్నారు. బాధితుల తరపున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది. పరిహారం చెల్లించకపోతే పనులు అడ్డుకుంటాం. –వీసం రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ, రాష్ట్ర కార్యదర్శి

హామీలు నమ్మి రోడ్డున పడ్డాం

బాధితుల తరఫున పోరాడతాం

నేను ఉన్న ఇంటికి నష్టపరిహారం ఇచ్చారు. ఇంటి స్థలం ఇవ్వలేదు. అలాగే నా కుమార్తెకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేదు. దీనికోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. భూములు తీసుకునేటప్పుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. స్థానికులకు ఇక్కడ ఉపాధి కల్పించడం లేదు. ఇతర ప్రాంతాల వారికి పనులు కల్పిస్తున్నారు.

–రావి వరహాలు, పాటిమీద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement