● నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద కారును ఢీకొన్న లారీ
యలమంచిలి రూరల్ : భీమవరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ యలమంచిలి మండలం కొక్కిరాపల్లి హైవే కూడలి వద్దకు చేరుకున్న సమయంలో బ్రేక్ పనిచేయకపోవడంతో వాహనాన్ని అదుపు చేసే క్రమంలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పైకి ఎక్కించాడు. వ్యాన్ అదుపుతప్పి డివైడర్ అవతల వైపునకు దూసుకుపోయింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి అమలాపురం వెళ్తున్న కారు రావడంతో చేపల వ్యాన్ ఢీకొట్టింది. వెనుక వస్తున్న మరొక లారీ కూడా కారును ఢీకొంది. దీంతో కారు నుజ్జయింది. కారు వెనుక సీట్లో కూర్చున్న సి. హేమంత్, సి.వీరయ్య, కె.రమేష్, హైదరాబాద్‌కు చెందిన లారీ డ్రైవర్ ఎం.శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు యలమంచిలి ట్రాఫిక్ ఎస్‌ఐ బి.రామకృష్ణ తెలిపారు. గాయపడినవారిని హైవే అంబులెన్సు వాహనంలో అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.


