తుమ్మపాల : అన్ని మండలాల్లో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి మండల అభివృద్ధి అధికారులు, ఉప మండల అభివృద్ధి అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్, వ్యవసాయం, విద్యుత్, డీఆర్‌డీఏ, డీపీఓ, నీటిపారుదల శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన 280 వినతులను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. వరి పంటలను బీమా పరిధిలోకి తీసుకురావాలని, బీమా పరిధిలోకి రాని పంటలకు పీఎండీఎస్ విధానం ద్వారా సహజ వ్యవసాయ నిపుణుల సహకారంతో రక్షణ కల్పించాలని తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోని చెరువులను పరిశీలించి, నిమజ్జనం చేసిన విగ్రహాల వ్యర్థాలు, దుమ్ము, ధూళిని తొలగించి పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి కోసం ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గంలో చేపడుతున్న రూ.200 కోట్ల అభివృద్ధి పనులను స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని, ఇందుకు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి నెలా ఒకటో తేదీని సంక్షేమ దినోత్సవంగా నిర్వహించాలన్నారు. ఉదయం పింఛన్ల పంపిణీ పూర్తి చేసి, మధ్యాహ్నం ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్, పీజీఆర్‌ఎస్ సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలతో చర్చించి, వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. ప్రమాదకర కూడళ్లు, మలుపుల వద్ద వైర్‌లెస్ లైట్ల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలని, అవసరమైన చోట్ల మండల పరిషత్ నిధులతో సైన్ బోర్డులు, జీబ్రా క్రాసింగ్‌లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రమాదకరంగా మారిన పాత, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల కూల్చివేత ప్రక్రియను బుధవారంలోగా పూర్తి చేయాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలో గత రెండు నెలల్లో రూ.67 కోట్ల నిధులు విడుదలైనట్టు తెలిపారు. జల్‌జీవన్ మిషన్ పనుల పురోగతిపై కూడా సమీక్షించారు. ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు రూ.67 కోట్ల విలువైన బిల్లులు చెల్లించినట్టు తెలిపారు. ప్రతి మండలంలో ఎంపీడీఓలు కాంట్రాక్టర్లతో సమావేశమై పనులను త్వరగా పూర్తి చేయించాలని, పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్ల ఒప్పందాలను రద్దు చేసే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


