సంక్రాంతి కల్లా గోతులు లేని రోడ్లు చూస్తారని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు..రహదారులన్నీ అద్దంలా మెరిపిస్తామన్నారు.. కానీ రెండు సంక్రాంతి పండగలు గడిచిపోయాయి. రోడ్లు అద్దంలా కాదు..అధ్వానంగా మారాయి. గత ప్రభుత్వంలో నిధులు మంజూరైన రహదారులను పట్టించుకోవడం మానేశారు. కనీసం తాము శిలాఫలకాలు వేసిన రోడ్లయినా పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి కనబరచడం లేదు. అక్కడక్కడా మరమ్మతులు చేపట్టి గొప్పగా ప్రచారం చేసుకున్న రోడ్లలో నాసిరకం పనుల డొల్లతనం ఇటీవలి వర్షాలకు బయటపడింది. ఫలితం నరకప్రాయమైన రహదారుల్లో జనం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. హామీలను అమలు చేయలేని కూటమి పాలకుల తీరును ఛీత్కరిస్తున్నారు.
గోతిలో పడిన హామీలు..
● కూటమి పాలనలో దయనీయంగా రోడ్లు
● అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్యాచ్ వర్క్ పనులు నాసిరకమే
● విస్తరణ పనులున్న చోట వాహనదారుల పరిస్థితి దయనీయం
● అంతులేని కథలా బి.ఎన్.రోడ్డులో వాహనదారుల కష్టాలు
● పాలకుల నిర్లక్ష్యం.. జనానికి శాపం
సాక్షి, అనకాపల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో రహదారుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో రహదారుల అభివృద్ధి అంశంపై విరుచుకుపడిన అప్పటి ప్రతిపక్ష పార్టీలు తీరా కూటమి ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేశారు. మొదట్లో ప్యాచ్ వర్క్‌లని చెప్పి నాసిరకం పనులు చేసి మమ అనిపించారు. ఈ రెండేళ్లలో రహదారుల మరమ్మతుల పేరు తో లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా కొద్దికాలానికే మళ్లీ గుంతలమయంగా మారాయి.
ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం
జిల్లాలో నిర్మాణంలో ఉన్న రహదారుల పరిస్థితి ఒక రకంగా ఉంటే, గోతుల మయంగా మారిన రహదారులది మరో రకం దుస్థితి. నర్సీపట్నం–ఘాట్ రోడ్డులో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నా ఆ శాఖ అధికారులకు చీమకుట్టినట్టయినా లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. చీడికాడ మండలంలోని వరాహపురం, కట్టువాన అగ్రహారం వెళ్లే రోడ్డులో 50 నుంచి వంద మీటర్ల వరకూ గోతులు ఏర్పడ్డా యి. రోలుగుంట మండల కేంద్రం గోతులతో దర్శనమిస్తోంది. కశింకోట మండలంలో జాతీయ రహదారి కూడా గోతులతో దర్శనమిస్తోంది. అనకాపల్లి–అచ్యుతాపురం రహ దారి విస్తరణలో భారీ వాహనాలను నియంత్రించక స్థానికులు ఇబ్బందుల పాలవుతున్నారు. చాలా ప్రాంతాల్లో మండలాలను అనుసంధానం చేసే రహదారులకు అతీగతీ లేకుండా పోయింది. అచ్యుతాపురం మండలంలోని పర్యాటక ప్రాంతమైన కొండకర్ల గ్రామంలోకి వెళ్లే రహదారులు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి.


