అనకాపల్లి : గ్రామీణ ప్రాంతాల్లో కొండలను పిండి చేసుకుని ఏఎంఆర్ యాజమాన్యం కోట్లాది రూపాయలను దోచుకుంటోందని, దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయని జిల్లాలో కొంతమంది స్థానిక ప్రజలు చెప్పడం జరిగిందని ఏపీ మాజీ ఇంటిలిజెన్స్ డీజీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు అన్నారు. ఈ విషయమై నిబంధనలు అతిక్రమిస్తున్న ఏఎంఆర్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. మండలంలో మార్టూరు జంక్షన్ వద్ద అక్రమంగా లారీల నుంచి నగదు వసూలు చేస్తున్న ఏఎంఆర్ యాజమాన్యంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. అక్కడ నుంచి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ జి.ప్రేమ్‌కుమార్‌కు ఏఎంఆర్ యాజమాన్యంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ డీజీ విలేకరులతో మాట్లాడుతూ ఏఎంఆర్ సంస్థలో పని చేస్తున్న కొంతమంది వ్యక్తులు చట్టబద్ధత లేకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నగదు వసూలు చేస్తున్నారని అన్నారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఇద్దరు వ్యక్తులను నియమించి స్టాంప్ ప్యాడ్ ఉపయోగించి, నగదు వసూలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీనిపై లారీ డ్రైవర్లను ఆరా తీయగా రోజూ ఏఎంఆర్ యాజమాన్యం లారీలను ఆపి అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారని తెలిపారని, నగదు చెల్లించకుండా వాహనాలను తీసుకుని వెళుతున్న సమయంలో చెక్‌పోస్టు వద్ద ఉన్న వ్యక్తులు బైక్‌పై లారీ వెంటపడి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇదో రకం రౌడీరాజ్యంలా ఉందని, ఈ అక్రమాలపై పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రాన్ని పూర్తి స్థాయి బీహార్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు కంకణం కట్టుకున్నారన్నారు. ఇటువంటి అన్యాయాలపై ప్రజల గొంతు వినిపించాలనే దృఢ సంకల్పంతో పోరాడుతున్నామన్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ పాలన లేకుండా పోయిందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తున్న ఏఎంఆర్ యాజమాన్యంపై హైకోర్టులో కేసులు వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు గంటా శ్రీరామ్, నల్లమోతు చక్రవర్తి, మల్లారెడ్డి అజయ్, మొల్లేటి నవీన, దాడి ప్రసాధ్, రాజాన దొరబాబు పాల్గొన్నారు.


