దళారుల భోజ్యం | - | Sakshi
Sakshi News home page

దళారుల భోజ్యం

Sep 28 2026 12:53 AM | Updated on Sep 28 2026 12:53 AM

ఎఫ్‌ఆర్‌కే కిట్లు మూలకే..

రేషన్‌ బియ్యం..

యలమంచిలి రూరల్‌ : జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమాలు వ్యవస్థీకృతంగా మారాయి. నియోజకవర్గాలు, ప్రాంతాలు, రైస్‌మిల్లుల వారీగా దళారు లు, మిల్లర్లు, డీలర్లు బృందాలుగా ఏర్పడి మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు. కూటమి పార్టీల నాయకులతో పాటు పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టజెప్పడంతో చౌక బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బియ్యం దందాను అరికట్టాల్సిన అధికారులు తనిఖీలు నామమాత్రంగా చేపడుతూ అక్రమార్కులకు సహకారం అందిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎక్కడైనా పీడీఎస్‌ బియ్యం పట్టుబడితే నామమాత్రంగా 6ఏ కేసు నమోదు చేసి,జరిమానాలతో సరిపెడుతున్నారు. చౌక దుకాణాల్లో బియ్యం పంపిణీపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన మండల, జిల్లా స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా చౌక దుకాణాల డీలర్లు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచే దందాకు తెరతీస్తున్నారు. లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయకుండా వేలిముద్రలు వేయించుకుని డబ్బు ఇస్తున్నారు. నిర్భయంగా నెల మొదట్లోనే స్టాకు లేదు డబ్బులు తీసుకెళ్లండని డీలర్లు బాహాటంగానే చెబుతున్నారు. కొందరు డీలర్‌లైతే వేలిముద్రలు వేయించుకున్న తర్వాత లబ్ధిదారులకు డబ్బులు కూడా ఆలస్యంగా చెల్లిస్తుండడం విశేషం. ఫిర్యాదులు చేస్తున్నా పౌరసరఫరాల అధికారులు డీలర్లకే వత్తాసు పలుకుతుండడంతో లబ్ధిదారులు ఏమీ చేయలేకపోతున్నారు.

అక్రమార్కులపై 6ఏ కేసులతో సరి

చౌక బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఎక్కడైనా పట్టుబడితే ఆయా డీలర్లు,మిల్లర్లపై 6ఏ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు.

జిల్లాలో 1069 డిపోల ద్వారా ప్రతి నెలా 15.3 లక్షల మంది లబ్ధిదారులకు 7652 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అందజేస్తున్నారు.దీనిలో 40 నుంచి 50 శాతానికి పైగా పక్కదారి పడుతున్నట్టు సమాచారం లబ్ధిదారులకు కేజీకి రూ.15 నుంచి రూ.17 వరకు ఇస్తున్నారు.వీటిని డీలర్లు వ్యాపారులకు అధిక ధరకు అమ్ముకుని లాభపడుతున్నారు. జిల్లాలో గత రెండేళ్లలో 234 వరకు 6ఏ కేసులు నమోదయ్యాయి.జరిమానాలతో సరిపెట్టడంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు.

నిజానికి తరచూ 6ఏ కేసులు నమోదవుతున్న నిందితులపై పీడీ యాక్టు పెట్టాల్సి ఉన్నా జిల్లాలో ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు.దీంతో చౌక బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదన్న విమర్శలున్నాయి.

తాత్కాలిక డీలర్లకు కూటమి నేతల అండ

ఇక జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్‌ డీలర్ల స్థానంలో చౌక డిపోలకు నియమిస్తున్న తాత్కాలిక డీలర్లు కూటమి నాయకుల అండతో మరింతగా రెచ్చిపోతున్నారు. తమకు ఫలానా ఎమ్మెల్యే,స్థానిక కూటమి నాయకుల అండ ఉందంటూ బరితెగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తాత్కాలిక డీలర్లుగా కాగితాల్లో మహిళల పేర్లే ఉంటున్నా తెరవెనుక వ్యవహారాలన్నీ వారి భర్తలే చక్కబెడుతున్నారు. బియ్యం అమ్మకాలు, రవాణా, ఇలా అన్నీ వారే చేస్తారు.శాశ్వత డీలర్లు వస్తే తమకు అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఇదే అదునుగా జేబులు నింపుకొంటున్నారు.

జిల్లాలో డిపోలు 1069

లబ్ధిదారులు : 15.3 లక్షలు

ప్రతి నెలా చౌకబియ్యం పంపిణీ : 7652 మెట్రిక్‌ టన్నుల

పక్కదారి పట్టేది :40 నుంచి 50 శాతం

బియ్యానికి బదులు లబ్ధిదారుకు చెల్లించేది : కిలోకు రూ.15– రూ.17

జిల్లాలో రెండేళ్లలో నమోదైన6ఎ కేసులు : 234

పంపిణీకి ముందే..బియ్యం పక్కదారి

బాహాటంగా రేషన్‌ అక్రమాలు

నిరుపయోగంగా ఎఫ్‌ఆర్‌కే కిట్లు

చౌక బియ్యం అక్రమార్కులపై 6ఏ కేసులతో సరి

అధికారుల అండతో పేట్రేగుతున్న బియ్యం మాఫియా

యలమంచిలి మున్సిపాలిటీ పరిధి తెరువుపల్లిలో గతేడాది జూలై 10వ తేదీన న్యూ వెంకటేశ్వరా రైసు మిల్లు యజమాని వ్యానులో అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

గతేడాది ఆగస్టు 8వ తేదీ రాత్రి యలమంచిలి మండలం ఏటికొప్పాక రైల్వేగేటు సమీపంలో లారీలో తరలిస్తున్న 6.5 టన్నుల చౌక బియ్యాన్ని డీటీ స్వాధీనపర్చుకుని పౌరసరఫరాలఅధికారులకు అప్పగించారు.

ఈ ఏడాది జూలై 5వ తేదీన విజిలెన్సు అధికారులు జరిపిన తనిఖీల్లో యలమంచిలి పట్టణం సైతారుపేట రోడ్డులో ఉన్న 6వ నెంబరు రేషన్‌ దుకాణంలో అక్రమంగా నిల్వ చేసిన 43 క్వింటాళ్ల బియ్యంతో పాటు దుకాణాన్ని సీజ్‌ చేశారు. అయితే కూటమి పార్టీల నేతల ఒత్తిడితో వివరాలు బయటకు వెల్లడించకపోవడం గమనార్హం

అక్రమాలపై కఠిన చర్యలు తప్పవు

రేషన్‌ షాపుల్లో డీలర్లు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. చౌక బియ్యం అక్రమ రవాణా జరగకుండా ఎప్పటికప్పుడు డీలర్లను హెచ్చరిస్తున్నాం. తనిఖీల్లో పట్టుబడినా, ఫిర్యాదులు మా దృష్టికి వచ్చినా 6ఏ కేసులు పెడతాం. డీలర్లు లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుని బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్నట్టు మా దృష్టికి రాలేదు. లబ్ధిదారులకు ఏమైనా ఇబ్బందులుంటే అధికారులకు ఫిర్యాదు చేస్తే పరిష్కారమవుతాయి. పోషకాలు కలిగిన రేషన్‌ బియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచిది. లబ్ధిదారులు వాటిని ఉపయోగించుకోవాలి.

– కె.వరహాలు, తహసీల్దార్‌, యలమంచిలి

పీడీఎస్‌ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు పౌరసరఫరాల శాఖ అందజేసిన ఎఫ్‌ఆర్‌కే(ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్‌) ఐరన్‌ స్పాట్‌ కిట్లు మూలకు చేరాయి. పౌర సరఫరాల అధికారులు వీటిని వినియోగించకపోవడంతో అవన్నీ బీరువాలకే పరిమితమయ్యాయి. ఇదే సమయంలో విజిలెన్సు అధికారుల తనిఖీల్లో మాత్రం తరచూ చౌక బియ్యం పట్టుబడుతోంది. రేషన్‌ బియ్యంలో ప్రతి వంద గింజలకు ఐరన్‌, బీ12, ఫోలిక్‌ యాసిడ్‌ తదితర పోషకాలు ఉండే పోర్టిఫైడ్‌ బియ్యపు గింజలను కలుపుతారు. సాధారణ బియ్యంలో అవి ఉండవు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే తనిఖీల్లో గుర్తించేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒక ఎఫ్‌ఆర్‌కే కిట్టు సరఫరా చేశారు. కిట్టులో రసాయనాలతో పరీక్షిస్తే తరలించేది ఏ బియ్యమో వెంటనే తెలిసిపోతుంది. అయినా జిల్లాలో అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement