సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని సహకార రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, ఇప్పుడు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. రూ.3 వేల కోట్ల విలువైన సహకార చక్కెర కర్మాగారాల ఆస్తులను బినామీలకు అప్పగించే కుట్ర జరుగుతోందని, దీనిని అడ్డుకునేందుకు న్యాయపోరాటానికై నా సిద్ధమని తెలిపారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. సహకార చక్కెర కర్మాగారాల భూముల విక్రయానికి మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రంలో మిగిలిన ఏకైక సహకార షుగర్ ఫ్యాక్టరీ అయిన గోవాడను కూడా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చోడవరం, మాడుగుల ప్రాంతాలకు చెందిన 25 వేల మంది రైతులు ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి ఉన్నారని, 2025 వరకు క్రషింగ్ జరిగిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.90 కోట్లు తీసుకొచ్చి ఫ్యాక్టరీని కాపాడామని తెలిపారు. ప్రస్తుతం రైతులకు చెల్లించాల్సిన రూ.30 కోట్ల బకాయిలు, కార్మికులకు ఇవ్వాల్సిన రూ.5 కోట్లను చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఈ నెల 28న రైతుల పక్షాన మహాజన సభ నిర్వహించనున్నామని తెలిపారు. బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ముందుకు వస్తుందని భావించామని, కానీ గోవాడ ఆస్తులను విక్రయించి చెల్లిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఫ్యాక్టరీ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ షుగర్ ఫ్యాక్టరీలతో పాటు గోవాడ, రాష్ట్రంలోని ఇతర కర్మాగారాలకు చెందిన 770 ఎకరాలకు పైగా భూములను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోపించారు. కోర్టు వివాదాల్లో ఉన్న తుంపాల, నెల్లూరు, కొవ్వూరు ఫ్యాక్టరీల భూముల విక్రయంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.వైఎస్సార్ హయాంలో షుగర్ ఫ్యాక్టరీలకు నిధులు అందించి ఆదుకున్నారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మూతపడిన కర్మాగారాలను తెరిపించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పంచదార విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయంతో రైతులు, కార్మికులకు సహాయం చేశామని పేర్కొన్నారు.2024 గోవాడ షుగర్ ఫ్యాక్టరీ జనరల్ బాడీ సమావేశంలో గతంలో రూ.90 కోట్ల కంటే ఎక్కువ నిధులు తీసుకొస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు భూముల విక్రయంపై మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల పేరుతో సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. తాను చోడవరం చక్కెర కర్మాగారంలో రైతుగా, షేర్ హోల్డర్‌గా ఉన్నానని తెలిపారు. సహకార వ్యవస్థను బలోపేతం చేయకుండా బలహీనం చేసే విధానాలను చంద్రబాబు అనుసరించారని ఆరోపించారు.చంద్రబాబు హయాంలో 11 సహకార చక్కెర కర్మాగారాలు నిర్వీర్యమయ్యాయని, 2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక తాండవ, ఏటికొప్పాక, తుంపాల, భీమసింగి ఫ్యాక్టరీలను తిరిగి పనిచేసేలా చేశారని తెలిపారు. చోడవరం ఫ్యాక్టరీని కూడా గతంలో విక్రయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక, తుమ్మపాల, తాండవ, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలపై లక్ష మంది రైతులు ఆధారపడి ఉన్నారని, వాటికి ఏడాదికి 5 లక్షల టన్నుల క్రషింగ్ సామర్థ్యం ఉందన్నారు. రైతులకు కేంద్ర మద్దతు ధరతో పాటు అదనంగా రూ.200 బోనస్‌గా ఇచ్చామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య, నియోజకవర్గ పరిశీలకులు గండి రవికుమార్ పాల్గొన్నారు.
సహకార చక్కెర కర్మాగారాల
ఉసురు తీస్తున్న ప్రభుత్వం
ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే
తీవ్రస్థాయిలో ఉద్యమం
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్


