అనకాపల్లి టౌన్ : బొజ్జన్న కొండను అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సిద్దార్ధ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బల్లా నాగభూషణం అన్నారు. పట్టణంలోని నెహ్రూచౌక్ జంక్షన్ వద్ద గౌతమ బుద్దుని విగ్రహం వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రఖ్యాతి గాంచిన ప్రాచీన బౌద్ధ పర్యాటక కేంద్రాల్లో బొజ్జన్న కొండ ఒకటని, గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో రూపొందించిన లేజర్ స్క్రీన్ థియేటర్, హరిత రిసార్ట్, పుడ్ కోర్టు సదుపాయాలను వినియోగంలోకి తేవాలన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారని అన్నారు. ఈ సందర్భంగా బొజ్జన్న కొండ చరిత్రను వివరించే కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వినకోట నీలేష్ గుప్తా, రొబ్బి మల్లేశ్వరావు, వెంకటరమణమూర్తి పాల్గొన్నారు.
3 రోజులుబ్యాంకు ఉద్యోగుల సమ్మె
అనకాపల్లి : దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 28, 29, 30 తేదీల్లో సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అమరావతి సర్కిల్ ఎస్‌బీఐ బ్యాంక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పైలా ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దశల వారిగా కేంద్ర ప్రభుత్వానికి బ్యాంక్ ఉద్యోగులు వినతిపత్రాలు అందజేసినప్పటికీ ఫలితం లేకపోవడం వల్ల సమ్మె చేసే పరిస్థితి వచ్చిందన్నారు. బ్యాంక్ ఖాతాదారు లు, స్థానిక ప్రజలు, ప్రజాసంఘాల, వివిధ పార్టీల నాయకులు బ్యాంక్ ఉద్యోగులకు సహకరించాలని ఆయన కోరారు.


