మాకవరపాలెం మండలం పీపీ అగ్రహారం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న సర్పానది
తుమ్మపాల : జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేసున్నారు. ఈ నెల 22 నుంచి 24తేదీ వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే జిల్లా సగటు 161.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. వర్షాలతో వాతావరణం చల్లబడడంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించినప్పటికీ పలుచోట్ల రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిముంపు పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
వర్షపాతంలో అచ్యుతాపురం మండలం 225.3 మిల్లీమీటర్లతో జిల్లాలోనే అత్యధికంగా నమోదైంది. సబ్బవరం మండలం 221.8, మాడుగుల 199.48, పరవాడ 199.2, చోడవరం 190.5 కె.కోటపాడు 180.6, అనకాపల్లి 174.3, కశింకోట 173.5, రోలుగుంట 168.8, నర్సీపట్నం 168.4, దేవరాపల్లి 163.9, మాకవరపాలెం 163.4, మునగపాక 161.7, గొలుగొండ 160.6, కోటవురట్ల 154.8, రావికమతం 151.9, బుచ్చెయ్యపేట 148.3, చీడికాడ 141, నక్కపల్లి 141, రాంబిల్లి 134.5, యలమంచిలి 121.7, నాతవరం 121. పాయకరావుపేట,118.7, , ఎస్.రాయవరం 98.7 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
పంటలకు ఊరట.. పశువుల మేతకు ఇబ్బందులు
వరుసగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వ్యవసాయ భూములకు పుష్కలంగా నీరు అందడంతో పలు పంటలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటికే నీరు నిలిచిన ప్రాంతాల్లో మరింత వర్షం కురిస్తే పంట పొలాల్లో నీటిముంపు ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువులకు అవసరమైన పచ్చిమేత సేకరణ, పొలాలకు వెళ్లి మేత కోసుకొచ్చే విషయంలోనూ పశుపోషకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చెరువులను తలపించేలా రోడ్లపై నీటి ప్రవాహం
వర్షాలకు పలు మండలాల్లో గ్రామీణ, ప్రధాన రహదారులపై నీరు చేరింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల పరిసరాల్లోకి సైతం వర్షపు నీరు చేరడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పొక్లెయిన్‌లతో నీటి తొలగింపు చర్యలు చేపడుతన్నారు. పలు ప్రాంతాల్లో రహదారులపై నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించేందుకు స్థానికులు స్వచ్ఛందంగా జేసీబీలను ఏర్పాటు చేసుకుని కాలువలు, నీటి ప్రవాహ మార్గాల్లో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో రహదారులపై నిలిచిన నీరు బయటకు వెళ్లేలా చేస్తున్నారు. అధికారులు కూడా లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి నీటిముంపు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


