దేవరాపల్లి : గురుకుల విద్యాలయంలో విద్యార్థులు వినియోగించగా వచ్చే వృధా నీటిని నిల్వ చేసి ఇతర అవసరాలకు వాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ ఎం.శివప్రసాద్ తెలిపారు. తెనుగుపూడిలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ బాలుర గురుకుల విద్యాలయాన్ని గురువారం ఆయన అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెనుగుపూడి గురుకుల విద్యాలయంతో పాటు కృష్ణా జిల్లా గొల్లనిపల్లిలోని విద్యాలయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి చేశామన్నారు. వృథా నీరు నిల్వ ఉండడం కారణంగా దుర్వాసనతో పాటు అపరిశుభ్రతతో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపధ్యంలోఈ నీటిని ఫిల్టర్ చేయడానికి రెండు ఫిల్టరేషన్ల చాంబర్లను నిర్మిస్తామన్నారు. శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసి విద్యాలయ ప్రాంగణంలో నాటిన మొక్కల పెంపకానికి వినియోగిస్తామన్నారు. పరిశుభ్రతతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, భూగర్భ జలాల పరిరక్షణకు దోహదపడే ఈ ప్రాజెక్టుకు వీబీజీ రామ్‌జీ పథకంలో రూ. 2 లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నట్టు ఆయన స్థానిక విలేకరులకు తెలిపారు. వీబీజీ రామ్‌జీ పథకం పీడీ నిర్మలాదేవి తదితర అధికారులతో సమావేశమై ఈ ప్రాజెక్టు అమలు తీరును వివరించారు. రెండు రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ అనుమతితో ప్రతిపాదనలను పంపించాలని ఆదేశించారు. నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టు సత్ఫలితాలిస్తే రాష్ట్రంలో మిగిలిన పాఠశాలకు విస్తరిస్తామన్నారు. ఆయన వెంట స్థానిక ఇన్‌చార్జి ఎంపీడీవో ఎస్.కిరణ్ వరప్రసాద్, ఇన్‌చార్జ్ డిప్యూటీ ఎంపీడీవో బి.అనంత ఉమాదేవి, వీబీజీ రాంజీ ఏపీవో వై. రుక్మిణీదేవి, స్థానిక గురుకులం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


