మునగపాక : దీపం ఉన్నపుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న ఆశ కూటమి నేతల్లో పెరుగుతుంది. వచ్చిన అవకాశాన్ని నగదు రూపంలో సాధించుకునేందుకు అధికార పార్టీకి చెందిన నేత ఒకరు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆశ పోస్టు కేటాయింపునకు మండల స్థాయి నేత రూ.4 నుంచి 5లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. పోస్టు మంజూరు మెరిట్ ద్వారా జరగాలని లేకుంటే న్యాయ పోరాటానికి సైతం అంటూ టీడీపీకి చెందిన నేత ఒకరు సంబంధిత అధికారుల ఎదుట కరాఖండీగా చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మునగపాక మండలం టి.సిరసపల్లికి గ్రామ పరిధిలో ఆశ కార్యకర్త పోస్టు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టు మంజూరుకు పలు నిబంధనలు తప్పనిసరిగా పేర్కొంది. ఇందుకోసం గ్రామానికి చెందిన అయిదుగురు వ్యక్తులు సంబంధిత పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇద్దరి దరఖాస్తులను సక్రమంగా లేని కారణంగా అధికారులు తిరస్కరించారు. ఒక్కపోస్టుకు ముగ్గురు వ్యక్తులు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం ద్వారా నియామకం మెరిట్ ప్రాతిపదికన నిర్వహించాల్సి ఉంది. ఇదే అదనుగా మండలానికి చెందిన కూటమి కీలక నేత సంబంధిత పోస్టు మంజూరుకు ధర నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు పోస్టుకోసం అడ్డదారిన ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తుంది. విషయం తెలుసుకున్న టి.సిరసపల్లికి చెందిన టీడీపీ నాయకులు పి.వీరప్పారావు అశ కార్యకర్త పోస్టును మెరిట్ ద్వారా భర్తీ చేయాలంటూ ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఆశ కార్యకర్త పోస్టుకు ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారు...అలాగే ఎన్ని తిరస్కరణకు గురయ్యాయనే వివరాలను గురువారం మునగపాక పీహెచ్‌సీ వైద్యాధికారి విమలగిరి అర్జీదారుడైన వీరప్పారావుకు అందజేశారు. కాగా ఆశ కార్యకర్త పోస్టును మెరిట్ ద్వారా భర్తీ చేయాలని ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఈ పోస్టు భర్తీకి సంబందించి మెరిట్ ఆధారమా లేకుంటే పలుకుబడి కలిగిన వ్యక్తి ప్రమేయమా అన్నది తేలాల్సి ఉంది.


