నులిపురుగును నులిమేద్దాం.. | - | Sakshi
Sakshi News home page

నులిపురుగును నులిమేద్దాం..

Sep 25 2026 1:29 AM | Updated on Sep 25 2026 1:29 AM

3.11 లక్షల మందికి ఆల్బెండజోల్‌ మాత్రలు సిద్ధం

ఏడాది నుంచి 19 ఏళ్ల వయసు వారికి పంపిణీకి ఏర్పాట్లు

నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

తుమ్మపాల : మొదటి ఏడాది నుంచి 19 ఏళ్ల వయసున్న సుమారు 3,11,885 మంది పిల్లలు, కిశోరులను లక్ష్యంగా చేసుకుని నులిపురుగుల నిర్మూలన చర్యలు చేపట్టనున్నట్టు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 25న అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేయనున్నామన్నారు. 1–2 ఏళ్ల పిల్లలకు 400 మిల్లీగ్రాములు ఆల్బెండజోల్‌ మాత్రలో సగం భాగాన్ని నీటిలో కలిపి ఇవ్వాలని, 2–19 ఏళ్ల వారికి ఒక పూర్తి మాత్రను నమిలి మింగేలా చూడాలని సూచించారు.

భోజనం చేసిన అరగంట అనంతరం ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయుల సమక్షంలో మాత్రలు వేయించాలని ఆదేశించారు. మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లల కోసం అక్టోబరు 5న మాప్‌–అప్‌ డే నిర్వహించి పంపిణీ చేస్తామని తెలిపారు. నులిపురుగుల సంక్రమణతో పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి తగ్గడం, కడుపునొప్పి, బలహీనత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, పాఠశాల హాజరు మెరుగుపడేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికీ నులిపురుగుల నిర్మూలన మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్య, మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, మున్సిపల్‌ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బంది తమ పరిధిలోని అర్హులైన పిల్లలందరికీ మాత్రలు అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు తప్పనిసరిగా ఇప్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement