‘ఏయూ’ నిధులపై నోరెత్తని బాబు | - | Sakshi
Sakshi News home page

‘ఏయూ’ నిధులపై నోరెత్తని బాబు

Sep 20 2026 12:45 AM | Updated on Sep 20 2026 12:45 AM

● ఏయూ వర్గాల తీవ్ర అభ్యంతరం ● ప్రభుత్వ కార్యకలాపాలకు ఏయూ నిధుల మళ్లింపుపై ఆగ్రహం

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ. 500 కోట్లు మంజూరు చేస్తామంటూ ఇచ్చిన హామీ గాల్లోనే తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం మళ్లీ విశాఖకు వచ్చినా, ఏయూ నిధులపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంపై విశ్వవిద్యాలయ విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

నాలుగు నెలలైనా కదలని జీవో

ఏప్రిల్‌ 27న జరిగిన ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వర్సిటీ మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ. 500 కోట్లు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే నాలుగు నెలలు గడిచినా ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి జీవో విడుదల కాలేదు. శనివారం ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన సీఎం, నిధుల విడుదలపై స్పష్టత ఇస్తారని అంతా ఆశగా ఎదురుచూశారు. కానీ ఆయన ప్రసంగంలో నిధుల ప్రస్తావన తేకపోవడమే కాకుండా, కనీసం ఏయూ వీసీతో కూడా మాట్లాడకపోవడం నిరాశ పరిచింది.

ఖజానా ఖాళీ చేస్తున్నారు: నిరుద్యోగ సంఘాల ఆరోపణ

సీఎం చెప్పే మాటలకు, చేసే చేతలకు అసలు పొంతన ఉండటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. శతాబ్ది వేడుకలకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం దారుణమని నిరుద్యోగ సంఘాల కన్వీనర్‌ డాక్టర్‌ సురేష్‌ మీనన్‌ మండిపడ్డారు. రూ. 500 కోట్ల మాట దేవుడెరుగు, ఉన్న వర్సిటీ ఖజానాపై కన్నేసి ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులను మళ్లిస్తున్నారు. ఏయూ నిధులను సర్కారు వినియోగించడం తక్షణమే మానేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ కార్యక్రమానికి రాజకీయ రంగు

విద్యాసంస్థల గౌరవాన్ని, పవిత్రతను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే నిబంధనలను విస్మరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం ఏయూ మైదానంలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వ పరమైనది. అయినప్పటికీ, ఏయూ ప్రాంగణానికి వెళ్లే మార్గంలో టీడీపీ జెండాలు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఆయన కుమారుడి ఫొటోలతో కూడిన ప్లెక్సీలను ఏర్పాటు చేయడంపై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను స్వాగతిస్తున్నామని అయితే ఏయూ మైదానాలను వాడుకుంటున్నందుకు తక్షణమే వర్సిటీకి అద్దెలు చెల్లించాలని డాక్టర్‌ సురేష్‌ మీనన్‌ కోరారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు రాజకీయ మకిలి అంటించకుండా నాయకులు బాధ్యతతో వ్యవహరించాలని, దిగువ స్థాయి కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ విషయంలో స్పష్టమైన దిశా నిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement