చోడవరం: విద్యుత్ శాఖ అధికారుల తీరుపై గ్రామస్తులు, అఖిల పక్ష పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని దుడ్డుపాలెంలో జనావాసాల మధ్య తాగునీటి కుళాయి ట్యాంక్ పక్కన కొత్తగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతోపాటు గ్రామస్తు లు, జనసేన, కమ్యూనిస్టు పార్టీల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.20 రోజుల కిందట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అయితా వెంకట రమణ, తాజా మాజీ సర్పంచ్ కూర్మదాసు మాలిబాబు, తాతబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆర్‌ఈసీఎస్ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకుండా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు సిమెంటు దిమ్మను నిర్మించారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. తాగునీటి కుళాయిల వద్దకు మహిళలు అధిక సంఖ్యలో వస్తారని, ఈ ప్రదేశంలో ప్రమాదకరమైన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో చోడవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులతోపాటు సీపీఐ జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, జనసేన నాయకుడు జెర్రిపోతుల నానాజీ మద్దతు పలికారు. జనవాసాలకు సమీపంలో కుళాయిల సముదాయం పక్కన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయవద్దని, విరమించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజకీయ కక్షతోనే ఇటువంటి దుశ్చర్యలకు స్థానిక అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్నారని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే సహించమంటూ అఖిలపక్ష పార్టీల నాయకులు, ప్రజలు హెచ్చరించారు. తక్షణం దీనిపై కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇదే గ్రామంలో వేరొక చోట విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దుడ్డుపాలెంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుపై నిరసన
కుళాయిల పక్కన ట్రాన్స్‌ఫార్మర్‌వద్దంటూ డిమాండ్
తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా


