సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామికి శనివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ బేడామండపంలో వేదికపై వేంజేపచేసి 100 నామాలతో సహస్రనామార్చన నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు.
శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం..
వరాహ లక్ష్మీనృసింహ స్వామికి శనివారం ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ బేడా మండపంలో ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెళ్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణం నిర్వహించారు. ఉభయదాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.
ఘనంగా గరుడ సేవ..
సింహాలేశుడికి గరుడ సేవ ఘనంగా జరిగింది. ఆలయ బేడా మండపంలో ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని వెండి గరుడ వాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ చేసి, విశేషంగా హారతులు అందజేశారు. భక్తులను గరుడ వాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు.


