విద్యార్థుల భవితవ్యంతో ఆటలా..! | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భవితవ్యంతో ఆటలా..!

Sep 8 2026 12:53 AM | Updated on Sep 8 2026 12:53 AM

ఉద్యోగ భద్రత కోసం తరచూ కళాశాల సిబ్బంది నిరసనలు

సమీప ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో విలీనం చేసేందుకు కుట్ర

ఏపీఈపీడీసీఎల్‌లో ఆర్‌ఈసీఎస్‌ విలీనంతో మొదలైన కళాశాల కష్టాలు

వందల కోట్ల ఆస్తి స్వాధీనం చేసుకొని జీతాలు చెల్లించేందుకు సైతం నిర్లక్ష్యం

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలగా గుర్తింపు ఇస్తేనే పరిష్కారం

2009లో గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అప్పటి ప్రభుత్వం

పారంభించిన కళాశాలపై కక్ష !

కుప్పం తరహాలో న్యాయం చేయాలని సిబ్బంది, విద్యార్థుల వేడుకోలు

ఆర్‌ఈసీఎస్‌ పాలిటెక్నిక్‌
కళాశాల పట్ల కుట్ర

సాక్షి , అనకాపల్లి : భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి. దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలంటే ముందుగానే లక్ష్యాలను నిర్మించుకోవాలి. సాంకేతిక విద్యకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో సగటు మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల అవసరముంది. ఒకప్పుడు విశాఖ ఉమ్మడి జిల్లా పరిధిలో భాగమైన ఇప్పటి అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీ, అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్‌,పాయకరావుపేట పరిధిలో పరిశ్రమలు,గాజువాక ఆటోనగర్‌లో నెలకొల్పిన కంపెనీలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన సముపార్జనకు విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కళాశాలలు అవసరమని 2004లో అప్పటి ప్రభుత్వం గుర్తించింది. మెరిట్‌తో పాటు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చదువుకోగలిగినప్పటికీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉండే అడ్మిషన్‌ అవకాశాలు తక్కువే. దీంతో కశింకోట ఆర్‌ఈసీఎస్‌ పరిధిలో ఉన్న లక్షా యాభై వేల మంది వినియోగదారుల పిల్లలకు 50 శాతం కోటాతో సీట్లు ఇవ్వాలనే లక్ష్యంతో 2009లో ఆవిర్భవించింది ఆర్‌ఈసీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల.

ప్రశ్నార్థకంగా కళాశాల భవితవ్యం..?

ప్రస్తుతం 720 సీట్లు ఉన్న కశింకోట ఆర్‌ఈసీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సాంకేతికపరమైన అంశాలే దీనికి కారణం కాదు. కూటమి ప్రభుత్వం ఉదాసీన వైఖరి సైతం తోడైంది. వెరశి సదరు కళాశాలలో ప్రస్తుతం చదువుతున్న 615 విద్యార్థులు, 46 మంది సిబ్బంది నిత్యం భయం భయంగానే గడుపుతున్నారు. సమయానికి జీతం రాక కళాశాల సిబ్బంది, ఉపాధ్యాయుల ఆందోళనతో విద్యార్థులకు ఏకాగ్రతతో కూడిన విద్య అందడం లేదు.

ఎంతో

ప్రత్యేకత..!

2009లో ప్రారంభమైన కశింకోట ఆర్‌ఈసీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇప్పటి వరకూ 3500 మంది డిప్లొమా పూర్తి చేశారు. 1500 మంది ఉద్యోగాలు సంపాదించగా వందలాది మంది ఉన్నత విద్యనభ్యసించారు. గ్రామీణ ప్రాంతంలో విద్యుత్‌ కనెక్షన్‌ కలిగిన మధ్య తరగతి కుటుంబీకులు డిప్లొమా పూర్తి చేయగలిగారు.

విలీన ప్రక్రియతో చిక్కులు మొదలు..!

ఆర్‌ఈసీఎస్‌ను 2021లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ఏపీఈపీడీసీఎల్‌లో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇది దశల వారీగా కొనసాగుతోంది. ఆరంభంలో సుమారు 112 కోట్ల రూపాయల ఆస్తులు, డిపాజిట్లు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 2021 నుంచి 2025 కాలంలో 412 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందిన ఏపీఈపీడీసీఎల్‌ కేవలం రెండు కోట్ల రూపాయల ఖర్చుని ఆర్‌ఈసీఎస్‌ పాలిటెక్నిక్‌ కోసం వెచ్చించలేదు. 2024 సెప్టెంబర్‌ నుంచి 2025 అక్టోబర్‌ వరకూ జీతాలు చెల్లించేందుకు ఏపీఈపీడీసీఎల్‌ స్పందించకపోవడంతో ఉద్యోగుల ఆందోళన మేరకు సర్దుబాటు చేశారు. మళ్లీ రెండు వారాల క్రితం సిబ్బంది ఆర్తనాదాల మేరకు మళ్లీ జీతాల బకాయిలు చెల్లించారు. ఒకానొక సమయంలో అఫిలియేషన్‌ కోసం కూడా మ్యాండేటరీ ఫీజును కూడా చెల్లించని నిర్లిప్తతను ఎండీగా వ్యవహరించిన అధికారులు ప్రదర్శించారు.

ప్రభుత్వ కళాశాలగా గుర్తింపు ఇవ్వాలి

ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ, జిల్లా కలెక్టర్‌, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈలు ఆర్‌ఈసీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల నిర్వహణ అంశంపై సమీక్షించాలని పలువురు కోరుతున్నారు. విలీన ప్రక్రియ నత్తనడకన సాగుతున్నందున కళాశాలను ప్రభుత్వ కళాశాలగా గుర్తింపు ఇవ్వాలని, 50 శాతం సభ్యుల పిల్లల అడ్మిషన్‌ వెసులుబాటు కొనసాగించాలని, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అందరిలో నెలకొన్న భయాన్ని తొలగించాలని నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఆర్‌ఈసీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల నిర్వీర్యానికి కుట్రకు తెరలేచింది. 1998 కుప్పంలో ప్రారంభించిన పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇక్కడి పాలిటెక్నిక్‌ కళాశాల నిర్వహణ పట్ల స్పష్టత లేని వ్యవస్థలకు తోడు దశల వారీగా కళాశాలకు ఎదురవుతున్న సవాళ్లతో సిబ్బంది ఆత్మ రక్షణలో పడగా, విద్యార్థులు అభ్యసనం పట్ల ఏకాగ్రత కోల్పోతున్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన 3 కోట్ల రూపాయల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. వందలాది కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్న ఏపీఈపీడీసీఎల్‌ ఈ ప్రాంత విద్యార్థుల భవితవ్యంతో మాత్రం ఆటలాడుకుంటుంది. 16 కిలోమీటర్ల దూరంలో మరో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో విలీనం చేసే ప్రతిపాదన ఒకటి తెరమీదకు తెచ్చి ఈ కళాశాల ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇక్కడి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో రెండే కోర్సులు ఉండగా, ఇక్కడ మాత్రం 4 కోర్పులు ఉన్నాయి. అంతే కాకుండా పేద విద్యార్థులకు 50 శాతం ఆర్‌ఈసీఎస్‌ సభ్యుల కుటుంబాల పిల్లలకు అడ్మిషన్‌ లభించే అవకాశం కోల్పోతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement