రెండున్నరేళ్లు నాన్చి ఇప్పుడు దరఖాస్తుల హడావుడి
ఈ నెల 7 నుంచి 16 వరకే గడువు
ప్రస్తుతం స్వీకరణ మాత్రమే
బడ్జెట్ చూసిన తర్వాతే మంజూరు అంటూ మెలిక
అసలు పింఛన్లు వస్తాయా?
అనకాపల్లి టౌన్ : ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల పేరుతో మరోసారి మోసం చేస్తుందేమోనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచినా కొత్త పింఛన్ల విషయంలో స్పష్టమైన కార్యాచరణ ముందుకు తీసుకురాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో హడావుడిగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించడంపై లబ్ధిదారులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో కొత్త పింఛన్లపై అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామని ప్రకటించడంతో అనేక మంది ఆశఽలు పెట్టుకున్నారు. ఇందులో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఇలా పలు కేటగిరిలలో పింఛన్లు ఇస్తామన్ని ప్రకటించింది. దీంతో ఎంతో ఆశతో ఎదురుచూసిన ప్రజలు ప్రభుత్వ ప్రకటనతో సచివాలయాలకు క్యూ కడుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ కొత్త పింఛన్ల కోసం కూడా అరకొర గడువు విధించింది. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. గడువు తక్కువగా ఉండడంతో వివిధ పనుల మీద ఊర్లకు వెళ్లిన వారు, తీర్థయాత్రలకు వెళ్లిన వారు అకస్మాత్తుగా తమ ప్రయాణాలు రద్దు చేసుకొని తిరిగి సొంత ఊర్లకు రావల్సిన పరిస్థితి నెలకొంది.
అసలు మెలిక ఇక్కడే..
ఎన్‌టీఆర్ భరోసా పింఛను దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం మోసం తెలియక దరఖాస్తుదారులు ఎంతో ఆశతో సచివాలయాలకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసినంత మాత్రాన పింఛను మంజూరు కాదు. ఇది కేవలం స్వీకరణ మాత్రమేనని, బడ్జెట్ పరిస్థితిని పరిశీలించిన తర్వాతే పింఛన్ల మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నట్టు ఆ పార్టీ ప్రచురించిన బ్రోచర్లపై స్పష్టంగా ఉంది. ఈ పింఛన్ల కోసం రెండున్నరేళ్లుగా పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తులు అందిస్తూనే ఉన్నారు. కలెక్టర్‌కు స్వయంగా వినతులు అందించినా పరిష్కారం కాలే దు. అయినా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో సీఎం చంద్రబాబుకు ఒక్కసారిగా పండుటాకులు గుర్తుకు వచ్చి పింఛన్లు ఇస్తామని హడావుడిగా ప్రకటించేశారు.
గత ప్రభుత్వంలో నిరంతర ప్రక్రియ
గత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో పింఛన్, రేషన్ కార్డు, ఇళ్లు, ఇలా ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా అది నిరంతర ప్రక్రియగా కొనసాగేది. వాలంటరీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి సంక్షేమ పథకాలు అందించేవారు. కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. సంక్షేమ పథకాలను అటకెక్కించింది.


