బుచ్చెయ్యపేట : కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు నిరాశే మిగులుతుంది. 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కొత్త పింఛన్‌ల మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజు సోమవారం పలు సచివాలయాల్లో సిబ్బంది పనులు చేసినా సైట్ ఓపెన్ కాలేదు. పలు గ్రామాల సచివాలయాల్లో ఒక్క దరఖాస్తు కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. కొత్త పింఛన్లు అందిస్తున్నారని గంపెడాశతో వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇతర లబ్దిదారులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి సచివాలయాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. బుచ్చెయ్యపేట, పెదమదీన, పెదపూడి, మల్లాం, మంగళాపురం, రాజాం తదితర గ్రామాల్లో ఒక్క దరఖాస్తు కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. ఆర్.భీమవరం, విజయరామరాజుపేట, తురకలపూడిలో ఒక్కో దరఖాస్తు, లోపూడి, పొట్టిదొరపాలెం, కొమళ్లపూడిలో కేవలం రెండేసి దరఖాస్తులు మాత్రమే నమోదయ్యాయి. తొలిరోజు పింఛన్ నమోదుకు వందలాది మంది ఆప్లికేషన్‌లు అందించినా సర్వర్ పనిచేయక ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. కొన్ని గ్రామాల్లో కూటమి నేతలు తాము చెప్పిన దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్ధానిక సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. 12వ తేదీ రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి వరసగా మూడు రోజులు సెలవు దినాలు వచ్చాయి. అంతేకాక గతంలో లేని నిబంధనలు కొత్తగా పింఛన్ నమోదుకు అంటించారు. పింఛన్‌దారు దరఖాస్తుతో పాటు తన ఆధార్ కార్డుతో పాటు ఆధార్ అప్‌డేట్, ఓటరు ఐడీ కార్డు, కరెంట్ బిల్లు, కులం, ఆదాయం, సదరం సర్టిఫికెట్లతో పాటు పాస్‌ఫొటో ఇతర సర్టిఫికెట్లతో ఆన్‌లైన్ దరఖాస్తు ఓటీపీ నంబర్లు సచివాలయ సిబ్బందికి అందించాల్సి వస్తుంది. కొత్త నిబంధనలు, తక్కువ గడువు, సర్వర్ కష్టాలతో రావడంతో అసలు గడువులోగా దరఖాస్తు అందించగలమా అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొత్త పింఛన్ నమోదుకు గడువు పెంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా చేయాలని పలువురు కోరుతున్నారు.


