తుమ్మపాల : ప్రస్తుతం జిల్లాలో 54.85 శాతం లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో జిల్లాలోని నీటి వనరుల పరిస్థితిపై జల వనరుల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో ప్రధాన, మధ్యతరహా రిజర్వాయర్లు, చిన్నతరహా నీటిపారుదల వనరుల్లోకి నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గినట్టు ఇరిగేషన్ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఒక ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టు, మూడు మధ్యతరహా, 2,880 చిన్నతరహా నీటిపారుదల వనరులు ఉన్నాయని, వీటితో పాటు చెరువులు, ఆనకట్టలు, గ్రోయిన్లు, చెక్‌డ్యామ్‌లు తదితర 2,880 చిన్నతరహా నీటి వనరులు సైతం ఉన్నాయని, అందుబాటులో ఉన్న నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని నీటి నియంత్రణ చేపడుతున్నామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో వారాబందీ విధానంలో రొటేషనల్ నీటి సరఫరా అమలు చేస్తూ, అందుబాటులో ఉన్న నీటిని రైతులందరికీ సమానంగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
అభివృద్ధి పనులు సత్వరం పూర్తి చేయాలి
అన్ని మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వారంలో పోలవరం నీటి ప్రాజెక్టుకు సంబంధించిన 3–సభ్యుల కమిటీ నివేదికపై దృష్టి సారించాలని ఆదేశించారు. తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రోజూ పిఆర్–5 యాప్‌లో క్లోరినేషన్ నివేదికలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల్లో ఎదురవుతున్న విద్యుత్ కొరత వోల్టేజ్ సమస్యల నివారణకు రైతు, గృహ విద్యుత్ మార్గాల వేర్వేరు సరఫరా పనులను వేగవంతం చేయాలని తెలిపారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, మెటీరియల్ రవాణా విషయాల్లో రైతుల నుంచి ఎదురవుతున్న అభ్యంతరాలను పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ రాజ్ కుమార్, డీపీఓ సందీప్, డ్వామా పీడీ నిర్మలా దేవి, ఆర్‌డబ్ల్యూఎస్., ఎస్‌ఈ అనిల్ కుమార్ పాల్గొన్నారు.


