ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్
చోడవరం: వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం డిమాండ్ చేసింది. జిల్లాలో నెలకొన్న సమస్యలు, అధికార పార్టీ నాయకుల దోపిడీ, ప్రజలు, రైతులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాల యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ముందుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కూటమి పార్టీల నాయకులు చేస్తున్న దోపిడీ, దందాల గురించి ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చని చంద్రబాబు నాయుడు డీఎస్సీలో అవకతవకలతో అందరినీ మోసం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 10 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు, లక్షన్నరకు పైగా సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశామని, ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు. శానసనమండలిలో ప్రతి పక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు ఇవ్వాల్సిన రూ.38కోట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. శాసనమండలిలో ఈ విషయంపై ప్రశ్నించినా ప్రభుత్వం ఏదో కుంటిసాకులు చెప్పి ఇప్పటివరకూ రైతులు పేమెంట్స్ మాత్రం ఇవ్వలేదన్నారు.
కరువుతో అల్లాడుతున్నా స్పందన లేదు
మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ రైతులు కరువుతో అల్లాడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. 2002 తర్వాత మళ్లీ ఇప్పుడు అంతకుమించి కరువు తాండవిస్తోందని, చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువుతో రైతులు, ప్రజలు అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, తర్వాత ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్‌తో పాటు అన్ని ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు పోటీ చేయడంతో పాటు గెలుపొందడానికి అన్ని విధాలా సమష్టిగా కృషి చేయాలన్నారు. యుద్ధం జరగాల్సిందే... పోరాటం చేయాల్సిందే అనే నినాదంతో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ఎన్నికల్లో, అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామన్నారు. కార్యకర్తలు, నాయకులకు జిల్లాలో ఉన్న పార్టీ నాయకులంతా అండగా ఉంటామని అమర్‌నాథ్ చెప్పారు. ఎలాంటి ఉద్యమానికై నా జిల్లా నాయకత్వం ఐకమత్యంతో ముందుంటుందని, ఇటీవల పంచదార్ల కొండపై మైనింగ్‌ను ఆపే వరకూ ఉద్యమం చేశామన్నారు.
● మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ జిల్లాలో కొండలను దోచుకునేందుకే కూటమి ఎంపీ ఇక్కడికి వచ్చారని ఆరోపించారు. జిల్లాలో అన్ని చోట్లా అధికార పార్టీ నాయకులు కొండలను అక్రమంగా తవ్వేస్తున్నారని, దీనిని ఎక్కడికక్కడ అడ్డుకుని జిల్లా సంపదను కాపాడాలన్నారు.
● మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా ధీటుగా సమాధానమిస్తున్నారని చెప్పారు. ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు.
● పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గ్రామస్థాయిలోనే ఎంపిక చేయాలని తెలిపారు. అప్పుడే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
● పాయకరావుపేట సమన్వయకర్త కంబాల జోగులు మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రి చేస్తున్న దోపిడీ, దందాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ ఇప్పటికే అనేక ఉద్యమాలు చేసిందన్నారు.
● మాజీ ఎంపీ డాక్టర్ భీశెట్టి సత్యవతి మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి తేవాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటే వాటిని ప్రైవేటీకరించాలని చంద్రబాబు చూస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై వైఎస్సార్‌సీపీ చేసిన పోరాటంతో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు.
ఈ సందర్భంగా పార్టీ కమిటీల ప్రతినిధులకు బొత్స సత్యనారాయణ ఐడీ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు పరిశీలకురాలు శోభా హైమావతి, పార్టీ పరిశీలకులు, రాష్ట్ర, జాతీయ కమిటీల ప్రతినిధులు కోలా గురువులు, డి.వి. సూర్యనారాయణరాజు, శరగడం చిన అప్పలనాయుడు, వీసం రామకృష్ణ, గండి రవికుమార్, ఈర్లె అనురాధ, దంతులూరి దిలీప్‌కుమార్, ఏడువాక సత్యారావు, దొండా రాంబాబు, పిన్నంరాజు సతీష్ వర్మ, చిక్కాల రామారావు, శరగడం చిమ్మినాయుడు, జిల్లా యూత్ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎల్. సుజాత, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో తీర్మానాలు
● అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలి, ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వాలి, పంట బీమా చెల్లించాలి.
● గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలి. లేని పక్షంలో ఆందోళన చేపట్టాలని నిర్ణయం.
● జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి. తవ్వకాలు నిలిపివేయాలి.
● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపివేయాలి.
21న చెరకు రైతులతో మహాజనసభ నిర్వహిస్తాం
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో, చెరకు రైతుల తరఫున వైఎస్సార్‌సీపీ ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించడంతో పాటు సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన సభ్య రైతుల మహాజనసభను ఈ నెల 20లోగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి 15 రోజుల గడువు ఇస్తున్నామని, ఆలోగా మహాజనసభను నిర్వహించకపోతే ఈ నెల 21వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గోవాడ ఫ్యాక్టరీ సమీపంలో తామే స్వయంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడానికి కాటాల వారీగా రైతులతో సమావేశమై చైతన్యపరుస్తామన్నారు.
8 నుంచి నియోజకవర్గ సమావేశాలు
జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 8వ తేదీన అనకాపల్లి, 10న పెందుర్తి, మాడుగుల, 11న చోడవరం, పాయకరావుపేట, 12న యలమంచిలి, నర్సీపట్నంలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు.


