నాతవరం: ఒకప్పటి మావోయిస్టు ప్రభావిత గిరిజన గ్రామాలు మళ్లీ పోలీసుల బూటు చప్పుళ్లతో దద్దరిల్లిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మండలంలోని సరుగు డు, సుందరకోట పంచాయతీల్లో 16 గ్రామాల్లో శనివారం పోలీసులు భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ ఆధ్వ ర్యంలో 155 ఇళ్లలో సోదాలు చేసి, 400 మందిని క్షుణంగా తనిఖీచేశారు. రికార్డులులేని 30 ద్విచక్రవా హనాలు, రెండు ఆటోలు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపుల్లో విక్రయిస్తున్న 40 క్వార్టర్ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. ఏడుగురికి గంజాయి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించారు. అందరికీ నెగిటివ్ రిపోర్టు వచ్చింది. అనంతరం గ్రామాల్లో ప్రజలతో ఆపరేషన్ వజ్ర ప్రహార్ ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా రూరల్ సీఐ రేవతమ్మ మాట్లాడుతూ గంజాయి రహిత గ్రామాలే లక్ష్యంగా ఎస్పీ తుహిన్ సిన్హా ,నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మాదక ద్రవ్యాల వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని తెలిపారు. డ్రగ్ రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి నాత వరం మండలం మీదుగా తుని హైవేకు గంజాయి రవాణా అవుతోందన్న ప్రచారంతో కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రధాన కూడళ్లు, జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావుతో పాటు నర్సీపట్నం రూరల్, టౌన్, గొలుగొండ, కృష్ణదేవి పేట,మాకవరపాలెం ఎస్‌ఐలు, సుమారు 70 మంది పోలీసులు కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు.
హడలిపోయిన గిరిజనులు
భారీ ఎత్తున పోలీసులు రావడంతో ఆ గిరిజన గ్రామాల ప్రజలు హడలిపోయారు. 20 ఏళ్ల కిందట ఈ 16 గ్రామాలు మావోయిస్టులకు అడ్డాగా ఉండేవి. తాండవ దళం, నాగుల కొండ దళం ఈ ప్రాంతంలో సంచరిస్తూ కార్యకలాపాలు నిర్వహించేవి. అప్పట్లో నాతవరంలో పోలీసు స్టేషన్ ఉండగా సరుగుడు గ్రామంలో ప్రత్యేకంగా స్పెషల్ పార్టీ పోలీసు ఔట్‌పోస్టు ఉండేది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సమయాల్లో ఈ గ్రామాల్లో పోలీసులు పెద్ద ఎత్తున ఇళ్లలో సోదాలు నిర్వహించేవారు. మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో గిరిజన గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అయితే శనివారం భారీ ఎత్తున పోలీసులు రావడంతో అప్పటి ఘటనలు గుర్తుచేసుకుని గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం కార్డన్ సెర్చ్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.


