జూకి కొత్త అతిథులు
మహారాణిపేట(విశాఖ): సుదీర్ఘ చరిత్ర కలిగిన విశాఖప ట్నం ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ త్వరలోనే మూడు ముక్కలు కానుంది. ఇప్పటివరకు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఉమ్మడిగా కొనసాగిన ఈ జిల్లా పరిషత్ విభజనకు కూటమి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విభజన అనంతరం రాష్ట్రంలోనే అత్యంత చిన్న జిల్లా పరిషత్‌గా విశాఖ ఆవిర్భవించనుంది.
ముగియనున్న పాలకవర్గ పదవీకాలం
1959లో సమితులు, తాలుకాలు, జిల్లా బోర్డులుగా విశాఖ జిల్లా పరిషత్ ఆవిర్భవించింది. 1983లో మండల, జిల్లా ప్రజా పరిషత్‌లుగా రూపుదిద్దుకుంది. 1986లో పూర్తిస్థాయి మండల, జిల్లా ప్రజా పరిషత్‌గా మారింది. 2021 సెప్టెంబర్ 25న జె.సుభద్ర అధ్యక్షతన కొలువుదీరిన పాలకవర్గ గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 24తో ముగియనుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాలకవర్గాల గడువు ముగుస్తుండటంతో జెడ్పీల విభజన తెరపైకి వచ్చింది. ఈ విభజనతో రాష్ట్రంలో జెడ్పీల సంఖ్య 28కి చేరనుంది.
నాలుగు మండలాలకే పరిమితం
కొత్త విభజన ప్రకారం విశాఖ జెడ్పీ పరిధిలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి అనే 4 మండలాలు మాత్రమే ఉంటాయి. గతంలో 39 జెడ్పీటీసీలు, ఎంపీపీలతో విస్తారంగా ఉన్న విశాఖ జెడ్పీ, ఇప్పుడు కేవలం 4 మండలాలకే పరిమితం కానుంది. కాగా, అనకాపల్లి జెడ్పీ పరిధిలోకి 24 మండలాలు, అల్లూరి జెడ్పీ పరిధిలోకి 11 మండలాలు రానున్నాయి.
జీవీఎంసీ విలీనానికి వ్యతిరేకత
భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో మెజారిటీ ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అత్యల్ప గ్రామాల్లో మాత్రమే విలీనానికి సుముఖత వ్యక్తమైంది.
సిబ్బంది, అధికారుల కేటాయింపు
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఈనెల 25 తర్వాత విభజన ప్రక్రియ అధికారికంగా అమలులోకి రానుంది. పంచాయతీరాజ్ శాఖలో సీనియారిటీ ఆధారంగా బదిలీలకు, సిబ్బంది సర్దుబాటుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జెడ్పీ పరిధిలోని 876 మంది అధికారులను, సిబ్బందిని జిల్లాల వారీగా ఈ కింది విధంగా కేటాయించనున్నారు.
అనకాపల్లి జిల్లా (24 మండలాలు): 60 శాతం సిబ్బంది
ఏఎస్‌ఆర్ జిల్లా (11 మండలాలు): 30 శాతం సిబ్బంది
విశాఖ జిల్లా (4 మండలాలు): 10 సిబ్బంది
ప్రతి జిల్లా పరిషత్‌కు 65 మంది, ప్రతి మండల ప్రజా పరిషత్‌కు 13 మంది చొప్పున ఉద్యోగులను నియమించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేటాయింపుల కోసం ఉద్యోగులకు ఆప్షన్లు ఎంచుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు.


