జిల్లాలో మాడుగుల, చోడవరం నియోజకవర్గాల పరిధిలోని రైతులకు జీవనాధారమైన గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని ఆధునికీకరించి, చెరకు రైతులకు పూర్వ వైభవం తెస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆధునికీకరణ మాట దేవుడెరుగు.. నిధుల కేటాయింపు నిలిపివేసి కూటమి పాలనలో ఈ ఫ్యాక్టరీని పూర్తిగా మూతపడేలా చేశారు. దీంతో వేలాది మంది చెరకు రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు రోడ్డున పడ్డారు. చంద్రబాబు అధికారం చేపట్టిన ఏడాదికే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. 25 వేల మంది రైతులతో పాటు అందులో పనిచేసే 2 వేల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఫ్యాక్టరీకి తరలించిన చెరకు బకాయిలను చెల్లించాల్సి ఉన్నా, ప్రభుత్వం కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.


