డాబాగార్డెన్స్: ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ ప్రస్తుతం 30 శాతంగా ఉందని రవాణా, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాదరెడ్డి తెలిపారు. విశాఖపట్నం నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తున్న ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల నిర్వహణను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు నిర్ణీత సమయపట్టిక ప్రకారం సమయపాలనతో నడుస్తున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఏరో ఎక్స్‌ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే తక్కువ చార్జీలతో రూ.50 నుంచి రూ.400 వరకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రయాణికులు వీటిని వినియోగించుకోవాలని కోరారు. ఈ పరిశీలనలో ఏపీఎస్‌ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, డిప్యూటీ సీటీఎం కె.పద్మావతి, డీఈఎంఈ ఎ.గంగాధర్, డిపో మేనేజర్లు ప్రసాద్, దుర్గ, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
స్టీల్‌ప్లాంట్ సీఎండీకి అదనపు బాధ్యతలు
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ ఎం.ఎన్.వి.ఎస్.ప్రభాకర్‌కు డైరెక్టర్ (పర్సనల్)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉక్కు మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డైరెక్టర్ (పర్సనల్) అరుణ్ కాంతి బాగ్చీ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఆదేశాలు ఏడాది పాటు లేదా పూర్తిస్థాయి నియామకం జరిగే వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


