మాకవరపాలెం: రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందగా.. జ్యూస్ షాపు ధ్వంసమైంది. ఈ ఘటన మాకవరపాలెం – విశాఖపట్నం ప్రధాన రహదారిలో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని శెట్టిపాలెం శివారు వెంకన్నపాలెం గ్రామానికి చెందిన చీపురుపల్లి దేముడు(80) శుక్రవారం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ జ్యూస్ దుకాణం వద్ద కూర్చున్నాడు. విశాఖ వైపు నుంచి నర్సీపట్నం వెళ్తున్న కారు ఒక్కసారిగా నిబంధనలకు విరుద్ధంగా కుడివైపున ఉన్న దుకాణంపైకి దూసుకువచ్చింది. దీంతో అక్కడే కూర్చున్న దేముడును సైతం ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనలో జ్యూస్ దుకాణం ముందు ఉన్న రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్‌తో సహా నలుగురు ఉన్నారని, వారంతా సురక్షితంగా బయటపడ్డారని స్థానికులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దామోదర్‌నాయుడు తెలిపారు.


