రూ.10 లక్షల కరెన్సీ నోట్లతో నూకాంబిక అమ్మవారి అలంకరణ
మహాలక్ష్మీగా గవరపాలెం సంతోషిమాత
అనకాపల్లి: శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా జిల్లాలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళా భక్తులు వరలక్ష్మీదేవికి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వ్రతాలు ఆచరించారు. పట్టణం, మండలాల పరిధిలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి.
●అనకాపల్లి మెయిన్ రోడ్డులోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. తెల్లవారుజామున నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు ఉప్పల రవిరామ్ జవహర్, కార్యదర్శి శ్రీధరాల సోమరాజు, కోశాధికారి కడిమిశెట్టి అచ్యుతరామయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంధి వీవీఎస్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
●గవరపాలెం సంతోషిమాత ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మీ అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మారిశెట్టి భాస్కరరావు, ఈవో చైతన్య తదితరులు పాల్గొన్నారు.
●గవరపాలెం నూకాంబిక అమ్మవారు ధనలక్ష్మీ అలంకరణలో దర్శనమిచ్చారు. సుమారు రూ.10 లక్షల విలువైన నగదుతో శోభాయమానంగా అలంకరించారు. మహిళలు ఉచిత కుంకుమ పూజలో పాల్గొని తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో యాళ్ల శ్రీధర్, చైర్మన్ పీలా నాగశ్రీను తదితరులు పాల్గొన్నారు.
●గవరపాలెం శతకంపట్టు కనకదుర్గ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ శాశ్వత చైర్మన్ కాండ్రేగుల నాయుడు, ప్రధాన అర్చకులు కె.హరి నారాయణ, కె.శివకేశవ, ఉదయగిరి చంద్రశేఖర్, వ్యవస్థాపకులు పీవీ రమణ, ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరాహ నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
●అరుంధతీనగర్‌లో నూకాంబిక అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రతినిధి పెట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.


