సత్తా చాటిన హిందూస్థాన్ షిప్‌యార్డు
డ్రైడాక్‌లోకి భారీ యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ జలాశ్వ’
తొలిసారిగా 175 మీటర్ల ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాకింగ్
తూర్పు తీరంలో నౌకాదళ సన్నద్ధతకు మరింత బలం
షిప్‌యార్డులో డ్రైడాక్ చేసిన ఐఎన్‌ఎస్ జలాశ్వ
సాక్షి, విశాఖపట్నం: హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్) తన సుదీర్ఘ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. భారత నౌకాదళానికి చెందిన అత్యంత భారీ యుద్ధ నౌకల్లో ఒకటైన.. ఏకై క ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్ ‘ఐఎన్‌ఎస్ జలాశ్వ’ని షిప్‌యార్డు విజయవంతంగా డ్రై డాక్ (ఓడల నిర్వహణ, మరమ్మతు ప్రక్రియ)లోకి తీసుకుంది. హెచ్‌ఎస్‌ఎల్ చరిత్రలో ఇంతటి భారీ సైనిక ప్లాట్‌ఫామ్‌ను డాకింగ్ చేయడం ఇదే తొలిసారి. అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియను ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా పూర్తిచేసి, రక్షణరంగ నౌకల మరమ్మతుల్లో తన సత్తాను మరోసారి చాటుకుంది.
కొత్త చరిత్ర లిఖిస్తూ..
దేశీయ నౌకల తయారీపై దృష్టి సారిస్తూ అత్యుత్తమ సేవలందించేందుకు మినీరత్న హోదా పొందిన తర్వాత హిందూస్థాన్ షిప్‌యార్డు వరుస లాభాలతో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. దేశీయ ఆర్డర్లతోపాటు అంతర్జాతీయ నౌకల మరమ్మతు పనులను దక్కించుకుంటూ చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎఫ్‌ఎస్‌ఎస్) నిర్మాణంతోపాటు 45 మిలియన్ టన్నుల డిస్‌ప్లేస్‌మెంట్ సామర్థ్యమున్న నౌకల్ని తయారుచేస్తోంది. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు, కార్గో షిప్స్, పోర్టు గ్రీన్ టగ్‌లు, కోస్ట్‌గార్డ్ వెసల్స్, జలాంతర్గాముల రీఫిట్, మరమ్మతు పనులను కూడా చేపడుతోంది. విదేశీ నౌకల మరమ్మతుల ద్వారా అంతర్జాతీయ వ్యాపారాన్ని ఆకర్షిస్తున్న షిప్‌యార్డు.. విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ వాణిజ్యం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో భారీ నౌకలను సైతం డ్రైడాక్‌లోకి తీసుకొస్తూ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటోంది.
అత్యద్భుత సమన్వయంతో..
ఐఎన్‌ఎస్ జలాశ్వ సాధారణ యుద్ధనౌక కాదు. సుమారు 175 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ నౌకను డ్రైడాక్‌లోకి తీసుకురావడం ఇంజినీరింగ్ పరంగా షిప్‌యార్డుకు పెద్ద సవాల్‌గా మారింది. దీనికోసం హెచ్‌ఎస్‌ఎల్ బృందాలు ముందుగానే సమగ్ర డాకింగ్ అనాలసిస్ నిర్వహించి.. నౌక బరువు, ఆకృతికి అనుగుణంగా కచ్చితమైన డాక్‌బెడ్‌ను సిద్ధం చేశాయి. అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో, భద్రతా ప్రమాణాల్లో ఏమాత్రం రాజీ పడకుండా నౌకను సురక్షితంగా డ్రైడాక్‌లోకి చేర్చారు. భారత నౌకాదళంలో బలగాలను, ట్యాంకర్లను ఒకేసారి తరలించే సామర్థ్యం ఉన్న అతిపెద్ద నౌకల్లో జలాశ్వ ఒకటి. ఇది సుమారు 1,000 మంది సైనికులతోపాటు కంబాట్ వెహికల్స్, హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు. గతంలో ‘ఆపరేషన్ సముద్ర సేతు’ తదితర విపత్తు సహాయక చర్యల్లోనూ ఈ నౌక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు హెచ్‌ఎస్‌ఎల్ ఆధ్వర్యంలో దీనికి సమగ్ర మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు.
నౌకాదళానికి వ్యూహాత్మక లబ్ధి
జలాశ్వను విజయవంతంగా డ్రైడాక్ చేయడం తూర్పు నౌకాదళానికి వ్యూహాత్మకంగా కీలక పరిణామం. ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌కు భారీ ప్లాట్‌ఫామ్‌ల మరమ్మతుల కోసం ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. తూర్పు తీరంలోనే భారీ నౌకల మరమ్మతులకు అనువైన సదుపాయం అందుబాటులో ఉండటంతో టర్న్ అరౌండ్ సమయం తగ్గి, ఫ్లీట్ ఎప్పటికప్పుడు కార్యకలాపాలకు సిద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. తూర్పు తీరంలోని సముద్ర జలాల్లో చైనా సహా పలు దేశాల నౌకాదళ కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం నిరంతరం సన్నద్ధంగా ఉండేందుకు హెచ్‌ఎస్‌ఎల్ అందిస్తున్న సాంకేతిక సేవలు కీలకంగా మారుతున్నాయి.
80 వేల టన్నుల సామర్థ్యంతో..
విశాఖలోని హెచ్‌ఎస్‌ఎల్ డ్రైడాక్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సదుపాయాల్లో ఒకటి. ఇది 240 మీటర్ల పొడవు, 53 మీటర్ల వెడల్పు, 8.5 మీటర్ల లోతుతో నిర్మితమైంది. ఒకేసారి 70,000 నుంచి 80,000 డెడ్‌వెయిట్ టన్నేజ్ సామర్థ్యమున్న భారీ నౌకలకు మరమ్మతులు నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంది. గతంలో 200 మీటర్లకు పైగా పొడవున్న కమర్షియల్ పానామాక్స్ బల్క్ క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లకు విజయవంతంగా మరమ్మతులు నిర్వహించింది. తాజాగా జలాశ్వ రాకతో భవిష్యత్‌లో నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు లేదా అంతకంటే సంక్లిష్టమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు షిప్‌యార్డ్ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు.


