అనకాపల్లి: పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆరోపించారు. గ్రామాల్లో పారిశుధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రీన్ అంబాసిడర్లు, పారిశుధ్య కార్మికులు ఆరు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆదివారం కె.కోటపాడుకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లాలోని పంచాయతీల నుంచి వందలాది గ్రామపంచాయతీ కార్మికులను తీసుకువెళ్లి శుభ్రత కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు పూర్తి చేశారన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి నెలా ఇవ్వాల్సిన రూ.6 వేల వేతనం కూడా సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు అర్ధాకలితో జీవించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’పేరుతో ప్రతి నాలుగో శనివారం ప్రచార ఆర్భాట కార్యక్రమాలు నిర్వహించేందుకు ఖర్చు చేస్తున్న నిధులను కార్మికుల జీతాలకు వినియోగిస్తే గ్రామాల పరిస్థితి మెరుగుపడుతుందని సూచించారు. గతేడాది నుంచి హెల్త్ అలవెన్స్‌గా నెలకు రూ.4 వేల చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. కె.కోటపాడు పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి వెంటనే బకాయి జీతాలు విడుదల చేసి, మున్సిపల్ కార్మికులతో సమానంగా వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకరరావు తదితరులు పాల్గొన్నారు.


