సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సొంత ఊరుకే చెందడంతో పాటు వరుసకు అల్లుడయ్యే విజయ్‌కుమార్ నాయుడు వ్యవహారాలు రోజుకు ఒకటి బయటపడుతున్నాయి. ప్రసిద్ధ శైవ క్షేత్రమైన పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ చేయడంతో పాటు అధికారులకు ఫలానా పనులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసేవాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఫలానా పని చేయాల్సిందేనంటే బెదిరించిన సందర్భాలూ ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రధానంగా భూమి వ్యవహారాలతో పాటు మైనింగ్ విషయాల్లో అటు రెవెన్యూ, ఇటు మైనింగ్, రవాణా, పోలీసుశాఖలోని అధికారులకు ఫోన్లు చేసి జోక్యం చేసుకునేవారని తెలుస్తోంది. ఫలానా పని చేయాల్సిందేనంటూ అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని వ్యవహారాల్లో...అధికారులందరికీ ఫోన్లు చేసి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నికల ముందు నుంచీ సీఎం రమేష్‌కు అన్నీ తానై వ్యవహరించడంతో పాటు గెలిచిన తర్వాత పోస్టింగుల్లో కూడా ఆయన జోక్యం ఉండేదని తెలుస్తోంది. ఇక పార్లమెంటు పరిధిలోని కొన్ని కాంట్రాక్టుల విషయంలోనూ అల్లుడి పెత్తనం జోరుగా సాగేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే అడ్డంగా అక్రమ మైనింగ్ చేస్తూ దొరికినప్పటికీ కేసు నమోదులో అటు మైనింగ్, ఇటు రాంబిల్లి పోలీసుల వ్యవహారం చూస్తే ఆయన పెత్తనం ఏ స్థాయిలో సాగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా పెద్దలను వదిలి.... కేవలం కిందిస్థాయి అధికారులపైనే ప్రతాపం చూపడమూ ఇప్పుడు ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని రోజుల కిందటే పోస్టింగులోకి వచ్చి అక్రమ మైనింగ్ వ్యవహారంలో అసలు పాత్ర లేని తహసీల్దారుపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని వీరు తప్పుపడుతున్నారు. అల్లుడి గిల్లుడికి తాము బలైపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసు పెట్టేందుకూ వెనుకంజ..!
విజయ్‌కుమార్ నాయుడు అక్రమ మైనింగ్ చేస్తూ అడ్డంగా దొరికినప్పటికీ అధికారులు స్వామి భక్తిని ప్రదర్శిస్తుండడం విమర్శల పాలవుతోంది. ప్రధానంగా రాంబిల్లి సీఐ తన స్వామిభక్తిని మరింతగా చాటుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమ మైనింగ్‌పై పెట్టిన కేసుల వివరాలను కూడా మీడియాకు వెల్లడించేందుకు ఇష్టపడడం లేదు. అంతేకాకుండా కేసు ఎవరి మీద పెట్టామనే పూర్తి వివరాలను కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయకపోవడం గమనార్హం. నమోదు చేసిన కేసుల్లో కూడా పెద్దగా పస లేకుండా చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్ విషయంలో జోక్యం చేసుకుంటే కేసులు పెడతానంటూ స్థానికులపై సీఐ బెదిరింపులకు దిగారనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ జరిగిందని నివేదిక రావడంతో పాటు ఎంత మేర కొల్లగొట్టారనే విషయం తెలిసినప్పటికీ కేసు నమోదులో ఇంతగా దాచి ఉంచడంతో పాటు తప్పుదోవ పట్టించేలా వివరాల నమోదు చూస్తుంటే.. అంతా సీఎం రమేష్ చూసుకుంటారు..తనకూ ఏమీ కాదనే ధైర్యమే ఇలా చేయిస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దలను వదిలి...!
వాస్తవానికి మైనింగ్ లీజు ఇచ్చే సమయంలోనే ఏ ప్రాంతం వరకు లీజు ఇచ్చారనే విషయాన్ని గనులశాఖ అధికారులు కలర్ కోడింగ్ ఇవ్వడం చేయాలి. లేనిపక్షంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకూ మైనింగ్ తవ్వకాలు జరపాలనే విషయాన్ని సూచిస్తూ పిల్లర్లు వేయాల్సి ఉంటుంది. అయితే, పంచదార్ల కొండలకు మైనింగ్ ఇచ్చే విషయంలో మైనింగ్ అధికారులు కనీసం చర్యలు తీసుకోలేదు. సాధారణంగా ఎంత లోతు తవ్వారు? ఎన్ని మెట్రిక్ టన్నులు తవ్వారనే వివరాలను తహశీల్లార్లకు అవగాహన ఉండదు. అయితే, అన్ని శాఖలు కలిసి సర్వే చేపట్టే సమయంలో మాత్రం తహశీల్దారు ఎంత మేర తవ్వకాలు జరిపారనేది పరిశీలించే అవకాశం ఉంటుంది. కేవలం నిరంభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ వరకే తహశీల్లార్ల పాత్ర ఉంటుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, పంచదార్ల విషయంలో పెద్దలను రక్షించేందుకుగానూ కొత్తగా వచ్చిన తహశీల్దారును బాధ్యుని చేస్తూ....ఏకంగా సస్పెండ్ చేయడం ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెద్దలంతా దోపిడీ చేసి....తమను బలిపశువును చేయడం ఏమిటంటూ మండిపడుతున్నారు.
ఎంపీ సీఎం రమేష్ బంధువు విజయకుమార్ నాయుడు లీలలు
నియోజకవర్గంలో పనుల కోసం అధికారులకు హుకుం
పంచదార్ల అక్రమ మైనింగ్‌లో అడ్డంగా దొరికిన వైనం
అయినా కేసు నమోదులో పోలీసుల దాగుడు మూతలు
అక్రమ మైనింగ్ వ్యవహారంలో పెద్దలపై ప్రేమ
కిందిస్థాయి అధికారులే బలిపశువులు


