ఏసీబీ వలలో మైన్స్‌ సర్వేయర్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో మైన్స్‌ సర్వేయర్‌

Aug 7 2026 1:14 AM | Updated on Aug 7 2026 1:14 AM

● రూ.15 లక్షలు డిమాండ్‌ ● రూ.5 లక్షలు తీసుకుంటుండగా పట్టుబడిన వైనం

అనకాపల్లి టౌన్‌: ఒకసారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు..అయినా అతని బుద్ధి మారలేదు. అక్రమ మార్గంలో వచ్చిన డబ్బుకు ఆశపడి మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. దీనికి సంబంధించి ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ హర్షిత, డీఎస్పీ రమణమూర్తి అందించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి మైన్స్‌ అండ్‌ జియాలజీ ఆఫీస్‌లో సర్వేయర్‌గా పనిచేస్తున్న దాదాల మురళీకృష్ణ అంబేడ్కర్‌కు ఊడేరు గ్రామంలో సర్వే నెంబర్‌ 211లో రెండు హెక్టార్లకు మైనింగ్‌ చేసుకోవడానికి మండలంలోని తుమ్మపాల గ్రామానికి చెందిన ఎస్‌.సునీల్‌కుమార్‌ కొంత కాలం క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వానికి కట్టాల్సిన రుసుము కూడా దరఖాస్తుదారు చెల్లించాడు. అయితే లీజు అప్లికేషన్‌ ప్రాసెస్‌ చేయాలంటే రూ.15 లక్షలు ఇవ్వాలని సర్వేయర్‌ డిమాండ్‌ చేశాడు. దీనిపై ఈ నెల 4న బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల ప్రకారం రూ.5 లక్షలు ఇస్తానని చెప్పి గురువారం ఉదయం 11 గంటల సమయంలో మైన్స్‌ కార్యాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బాధితుడు సర్వేయర్‌ను కలిశాడు. అతడి వద్ద నుంచి సర్వేయర్‌ రూ.5 లక్షల నగదు తీసుకుంటుండగా అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. 2008లో సర్వేయర్‌గా నియామకం అయిన దాదాల మురళీకృష్ణ అంబేద్కర్‌ టెక్కలి, విశాఖపట్నం, ఏలూరు, పాడేరు, అనకాపల్లి ప్రాంతాలలో పనిచేశాడు. 2018లో విశాఖలో ఒక వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గత ఏడాది జులై నాలుగో తారీఖు నుంచి అనకాపల్లి మైన్స్‌ కార్యాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

అవినీతిపై ఫిర్యాదు చేయండి.

ప్రభుత్వ శాఖల్లో అధికారులెవరైనా లంచం అడిగితే 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌కు గానీ, 9440440057 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని డీఎస్పీ రమణమూర్తి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement