దగా డీఎస్సీపై...
● పెద్ద ఎత్తున పాల్గొన్న నిరుద్యోగ యువకులు, విద్యార్థులు
● డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
● విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకూ ఉద్యమం
● రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ పోరుబాట నిర్వహించింది. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఏపీ జెన్‌జెడ్ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లాలో నర్సీపట్నం, పాయకరావుపేట, అనకాపల్లి నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొని సంఘీభావం తెలిపారు. మాడుగులలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, చోడవరంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పాల్గొని సంఘీభావం తెలియజేశారు.


