భూములిస్తే... దారిద్య్రమే మిగిలింది! | - | Sakshi
Sakshi News home page

భూములిస్తే... దారిద్య్రమే మిగిలింది!

Jul 27 2026 1:00 AM | Updated on Jul 27 2026 1:00 AM

పొలాలకెళ్లాలంటే రాంగ్‌ రూటే గతి కాగిత,వేంపాడు, అమలాపురం రైతుల ఆవేదన

రోడ్డుమధ్యలో ఆర్‌అండ్‌బీ నిర్మించిన డివైడర్‌

నక్కపల్లి: స్టీల్‌ప్లాంట్‌ బల్క్‌ డ్రగ్‌పార్క్‌ కోసం రోడ్డు నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులకు ‘దారి’ద్య్రం దాపురించింది. అధికారుల నిర్వాకం వల్ల తమ పొలాలకు వెళ్లేందుకు భవిష్యత్తులో నానా ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నుంచి భూములు సేకరించి, తమ పొలాలకు వెళ్లే వీలులేకుండా అధికారులు చేస్తున్నారంటూ కాగిత, వేంపాడు, అమలాపురం తదితర గ్రామాలకు చెందిన 500 మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కాగిత నుంచి బోయపాడు వరకు స్టీల్‌ప్లాంట్‌ అవసరాల కోసం 80 అడుగుల డబుల్‌ రోడ్డును నిర్మిస్తున్నారు. దీనికి సుమారు 60 ఎకరాలు అవసరమైంది. కొంత ప్రభుత్వ భూమి ఉండగా, మిలిగిన దానిని రైతుల నుంచి సేకరించారు. కాగిత నుంచి ఈ రోడ్డు నిర్మాణపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో ఈ భూముల మీదుగా తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేసుకుని రైతులు తమ పొలాల్లోకి, జగనన్న కాలనీకి రాకపోకలు సాగించేవారు. పాడి పశువులు, గొర్రెలు, మేకలు మేపుకొనేందుకు చుట్టుపక్కల పొలాల్లోకి పచ్చికబయళ్లలోకి తోలుకెళ్లేవారు. 50 శాతానికి పైగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రోడ్డుమధ్యలో డివైడర్‌ నిర్మిస్తున్నారు. కాగిత నుంచి యథావిధిగా రాకపోకలు సాగించేందుకు ప్రతి 100 మీటర్లకు ఒక యూటర్న్‌ ఇవ్వకుండా డివైడర్‌ నిర్మించడం వల్ల కాగిత చుట్టు పక్కల పొలాలు కలిగిన వేంపాడు, నెల్లిపూడి,అమలాపురం రైతులకు ఇబ్బంది ఏర్పడింది. ఇలా రోడ్డు మధ్యలో గ్యాప్‌ (యూటర్న్‌) తీసుకునే వెసులు బాటు కల్పించకపోవడం వల్ల రైతులు, పాడి పశువులను తీసుకుని వెళ్లేవారు రాంగ్‌ రూట్లో రెండు కిలోమీటర్లకుపైగా వెళ్లి తమ గమ్యాలకు చేరుకోవాల్సి వస్తోంది. 100 మీటర్లకు కాకపోయినా 200 మీటర్లకు అయినా యూటర్న్‌ తీసుకునేందుకు వీలుగా రోడ్డు మధ్యలో ఖాళీ విడిచిపెట్టాలని రైతులు కోరుతున్నారు. దీనికి అధికారులు ససేమిరా అంటున్నారు. నిబంధనల ప్రకారమే రోడ్డు, డివైడర్లు ఏర్పాటు చేస్తామని, రాంగ్‌ రూట్లో రాకపోకలు సాగించాల్సిందేనని చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణం పూర్తయి భారీ వాహనాలు రాకపోకలు ప్రారంభమయితే రాంగ్‌రూట్లో రావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పెద్దగా స్పందన లేదని వాపోతున్నారు. తమకు అనుకూలంగా, గతంలో ఉన్న మాదిరిగా ఎక్కడికక్కడ అటు ఇటు రాకపోకలు సాగించేందుకు వీలుగా యూటర్న్‌ ఏర్పాటు చేయకపోతే రోడ్డుపనులు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement