‘కమాండ్ కంట్రోల్’ పరిశీలన
గిరి ప్రదక్షిణ నేపథ్యంలో సింహాచలం కొండదిగువ తొలిపావంచా సమీపంలోని పుష్కరిణి సత్రంలో ఏర్పాటు చేసిన ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ విద్యాధరి పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలో మొత్తం ఏడు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అన్ని శాఖల అధికారులు అక్కడ 24 గంటలూ విధుల్లో ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పోలీసు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
గిరిప్రదక్షిణ మార్గం
తొలి పావంచా నుంచి మొదలయ్యే గిరి ప్రదక్షిణ.. అడవివరం జంక్షన్, పైనాపిల్ కాలనీ, సెంట్రల్ జైల్, ముడసర్లోవ, చినగదిలి, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, హనుమంతవాక జంక్షన్, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్డు, వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్‌బీ కాలనీ, సీతమ్మధార, అల్లూరి సీతారామరాజు విగ్రహం, బాలయ్యశాస్త్రి లేఅవుట్, పోర్టు స్టేడియం, డీఎల్‌బీ క్వార్టర్స్, మాధవధార, ఆర్‌అండ్‌బీ కార్యాలయం, ఎన్‌ఎస్‌టీఎల్, లక్ష్మీనగర్, కుమారి కల్యాణమండపం, ప్రహ్లాదపురం, శ్రీనివాసనగర్ మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటుంది.
దర్శన సమయాలు
జూలై 28: గిరిప్రదక్షిణ పూర్తి చేసి రాత్రికి చేరుకునే భక్తులకు రాత్రి 9.30 గంటల వరకు దర్శనం.
జూలై 29: ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరవధిక దర్శనం.
సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు, అనంతరం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు దర్శనం కల్పిస్తారు.
28న సుమారు 50 వేల మంది, 29న 80 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.


