కోటవురట్ల: కేజీబీవీలో 30 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈమేరకు సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీరాములు ఐదుగురికి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రత్యేకాధికారి సరితాదేవికి, శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న నలుగురు సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏపీసీ శ్రీరాములు మాట్లాడుతూ జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, ప్రాథమిక విచారణలో భాగంగా ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


