● హైకోర్టు ఆదేశాల మేరకు బాధితులకు న్యాయం చేయాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్
మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కోరారు. ఆదివారం స్థానిక పీఏసీఎస్ కార్యాలయం ఆవరణలో రహదారి విస్తరణ బాధితులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూడిమడక రోడ్డు విస్తరణ అందరికీ సమ్మతమేనన్నారు. గతంలో నిర్వహించిన గ్రామసభల్లో నిర్ణయించిన మేరకు పరిహారాన్ని నేరుగా అకౌంట్‌లో జమ చేయాలన్నారు. అంతేగానీ టీడీఆర్ బాండ్లు ఇస్తామంటూ చెప్పడం సరికాదన్నారు. బాధితుల్లో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు రహదారి విస్తరణకు సహకరించడం లేదంటూ తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేసేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే రహదారి విస్తరణకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. అప్పుడు నిర్ణయించిన పరిహారాన్ని కాకుండా ప్రస్తుతం భూమి విలువలను గుర్తించి, అందుకు అనుగుణంగా పరిహారం పెంచాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగేంతవరకు ప్రతి ఒక్కరూ రాజీలేని పోరాటం చేయాలన్నారు. డాక్టర్ చదరం శివాజీ, ఆడారి అచ్చియ్య నాయుడు, తనకాల జగ్గారావు, మళ్ల సూరప్పారావు, భీముని వెంకటేశ్వరరావు, బొడ్డేడ సోమ సుందరరావు తదితరులు పాల్గొన్నారు.


