ఊపిరి కాజేసి | - | Sakshi
Sakshi News home page

ఊపిరి కాజేసి

Jul 26 2026 1:56 AM | Updated on Jul 26 2026 1:56 AM

మందులు నమిలేసి

మహారాణిపేట: ‘కంచే చేను మేస్తే.. కాపెవరు?’ అన్న చందంగా మారింది కింగ్‌ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్‌)లో పరిస్థితి. రోగులకు ప్రాణం పోయాల్సిన ప్రాణవాయువునే పైసల పంటగా.. ఉచితంగా అందాల్సిన మందులనే ఆదాయ మార్గంగా మార్చుకున్న అక్రమార్కులు.. నిబంధనలను తుంగలో తొక్కి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ఆక్సిజన్‌ సరఫరా కాకుండానే ట్యాంకర్లు వచ్చినట్లు రికార్డులు సృష్టించడం.. సంబంధిత అధికారుల ధ్రువీకరణ లేకుండానే బిల్లులు క్లియర్‌ చేయడం.. మందుల కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడటం వంటి ఆరోపణలు కేజీహెచ్‌లో అవినీతి వేర్లు ఎంత లోతుగా విస్తరించాయో చెబుతున్నాయి. కేవలం ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల కాలంలోనే ఏకంగా రూ. 1.40 కోట్ల మేర బోగస్‌ ఆక్సిజన్‌ బిల్లులు మంజూరు కావడం ఈ మహాదోపిడీ తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రాణవాయువుపై పైసల వేట

ప్రాణం నిలబెట్టే ఆక్సిజన్‌ కూడా కొందరికి కాసుల యంత్రంగా మారిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆస్పత్రికి ట్యాంకర్లు వచ్చినట్లు రికార్డులు సృష్టించడం, సరఫరా జరిగినట్లు చూపించడం, నిబంధనల ప్రకారం తనిఖీలు లేకుండానే బిల్లులు ఆమోదించడం ద్వారా కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. కేవలం ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లోనే రూ.1.40 కోట్ల విలువైన ఆక్సిజన్‌ బిల్లులు అనుమానాస్పదంగా క్లియర్‌ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘చేతికి చిక్కిందే చేప’ అన్నట్టుగా దొరికిన అవకాశాన్ని దోపిడీకి వేదికగా మార్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారి సెలవు చూసి.. దోపిడీ బాట పట్టి

నిబంధనల ప్రకారం సీఎస్‌ఆర్‌ఎంవో ధృవీకరణ లేకుండా ఒక్క బిల్లు కూడా చెల్లించరాదు. అయితే అక్రమంగా వచ్చిన బిల్లులపై సంతకం చేయడానికి సంబంధిత అధికారి నిరాకరించారని సమాచారం. అంతే.. ‘తలుపు మూసినా కిటికీ చూసినట్లు’, ఆయన సెలవులోకి వెళ్లగానే ఇన్‌చార్జితో సంతకాలు చేయించి కోట్ల రూపాయల బిల్లులను వరుసగా క్లియర్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం వెనుక కొందరు ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు ఉన్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు.

రూ.15 లక్షలు వెచ్చిస్తే చాలు కానీ..

కేజీహెచ్‌లో మొత్తం ఆరు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఉండగా నాలుగు ప్లాంట్లు మరమ్మతులకు గురయ్యాయి. నిపుణుల అంచనా ప్రకారం సుమారు రూ.15 లక్షలు వెచ్చిస్తే వాటిని మళ్లీ వినియోగంలోకి తీసుకురావచ్చని చెబుతున్నారు. అయితే మరమ్మతులు చేపట్టకుండా బయటి నుంచి ఆక్సిజన్‌ను భారీగా కొనుగోలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘ఇంట్లో నెయ్యి ఉండగా పొరుగింటి వెన్న కోసం పరుగెత్తడం’ వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయన్నది ఇప్పుడు విచారణకు ప్రధాన అంశంగా మారింది.

మందుల్లోనూ అదే మంత్రం!

ఆక్సిజన్‌తో కథ ముగియలేదు. రోగులకు ఉచితంగా అందాల్సిన మందుల కొనుగోళ్లలోనూ భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని మందులను అధిక ధరలకు కొనుగోలు చేయడం, కొందరు సరఫరాదారులకే వరుసగా కాంట్రాక్టులు అప్పగించడం, అత్యవసర మందుల కొరత సృష్టించడం ద్వారా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు కేజీహెచ్‌లో 614 రకాల మందులు అందుబాటులో ఉండగా ప్రస్తుతం అవి 379 రకాలకే పరిమితమయ్యాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. బీపీ, ఇన్సులిన్‌, ఫిట్స్‌, క్యాన్సర్‌, థైరాయిడ్‌, యాంటీబయాటిక్స్‌, హిమోగ్లోబిన్‌ పెంచే మందులు సహా అనేక కీలక ఔషధాలు అందుబాటులో లేక రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

అత్యవసర పరిస్థితులు ఆదాయ వనరుగా..

ఆస్పత్రిలో మందులు లేక బయట కొనుగోలు చేసినా.. అత్యవసరంగా ఇచ్చిన మందుల బిల్లుల చెల్లింపుల్లోనూ గందరగోళం నెలకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితులను కూడా కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘పేదవాడి కన్నీరు కొందరికి కాసుల వర్షంగా మారిందా?’ అన్న ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది.

కేజీహెచ్‌లో ఆక్సిజన్‌ పేరుతో కోట్ల రూపాయలు పక్కదారి

సీఎస్‌ఆర్‌ఎంవో సంతకం లేకుండానే బిల్లుల క్లియరెన్స్‌

మందుల కొనుగోళ్లలో అక్రమాలు.. రోగులకు తీవ్ర ఔషధాల కొరత

అంతర్గత కమిటీపై అనుమానాలు.. స్వతంత్ర విచారణకు డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement