అనకాపల్లి: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో పంటలకు తీవ్రనష్టం జరుగుతుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్‌చార్జి ఏడీఆర్ ఎ.అప్పలస్వామి తెలిపారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన టి అండ్ వి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం నైరుతి రుతుపవనాలపై తీవ్రంగా కనిపిస్తోందని చెప్పారు. దీంతో జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం కంటే సుమారు 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. జూలై నెలలో 77 శాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైందని, జిల్లాలో 17 మండలాల్లో దీని ప్రభావం అధికంగా ఉందన్నారు. జిల్లాలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 56 వేల హెక్టార్లు కాగా, ఇప్పటికి కేవలం 169 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశార న్నారు. మొత్తం పంటల విస్తీర్ణం 69 వేల హెక్టార్లు కాగా, కేవలం 3,756 హెక్టార్ల సాగు చేపట్టారని తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి సీహెచ్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆశించిన వర్షాలు కురిస్తేనే జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త డి.ఉమామహేశ్వరరావు, విశాఖ జిల్లా వ్యవసాయ అధికారి ప్రతినిధి బి.విజయప్రసాద్, వివిధ మండల వ్యవసాయశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


