చూసిన కనులదే భాగ్యం.. ఈడేరిన మనోరథం | - | Sakshi
Sakshi News home page

చూసిన కనులదే భాగ్యం.. ఈడేరిన మనోరథం

Jul 26 2026 1:56 AM | Updated on Jul 26 2026 1:56 AM

అనకాపల్లి టౌన్‌: జై జగన్నాథ నినాదంతో అనకాపల్లి పట్టణం మార్మోగింది. ఇంద్రద్యుమ్న హాల్‌ నుంచి జగన్నాథ స్వామి ఆలయం వరకు మారు రథయాత్ర శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళా భక్తులు కోలాట నృత్యంతో అలరించారు. వందల సంఖ్యలో పాల్గొన్న భక్తులు జగన్నాథ, జగన్నాథ.. జగన్నాథ పాహిమాం... జగన్నాథ, జగన్నాథ.. జగన్నాథ రక్షమాం అంటూ తన్మయత్వంతో రథం వెంట సాగారు. ముందుగా ఉదయం కల్కి అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుభద్ర, బలభద్ర, జగన్నాథ స్వాములకు ప్రత్యేక అలంకరణ చేసి రథంపై ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు, నాయకులు, భక్తులు రథం లాగి మారు రథయాత్ర ప్రారంభించారు. ఈ రథయాత్ర ఇంద్రద్యుమ్న హాల్‌ నుంచి మళ్లవీధి, గాంధీబొమ్మ జంక్షన్‌, పెరుగుబజార్‌, చిన నాలుగు రోడ్ల జంక్షన్‌, మెయిన్‌ రోడ్డు మీదుగా వేల్పులవీధి, పెద నాలుగురోడ్ల జంక్షన్‌, శారదా బ్రిడ్జి వరకు వెళ్లి, తిరిగి పెద నాలుగు రోడ్ల జంక్షన్‌ మీదుగా వన్‌వే ట్రాఫిక్‌ డౌన్‌ మీదుగా గవరపాలెం, అగ్గిమర్రిచెట్టు వద్ద ఉన్న జగన్నాథస్వామి ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పట్టణ సీఐ జి. ప్రేమ్‌ కుమార్‌ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మునగపాక: మండలంలోని మునగపాక, నాగులాపల్లి గ్రామాల్లో జగన్నాథుని పండగను శనివారం ఘనంగా నిర్వహించారు. జగన్నాథ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున తిరుగు రథాయాత్రను భక్తి శ్రద్ధలతో జరిపారు. జై గంటలు కొడుతూ గోనలు, అరటి గెలలతో ఊరేగింపుగా బావుల వద్దకు వెళ్లి, ఇంటిళ్లపాదీ స్నానమాచరించి గోనల్లో నీరు నింపి తలపై పెట్టుకుని ఇళ్లకు చేరుకున్నారు. అనంతరం ప్రసాదం తయారు చేసి సమీపంలోని బంధువులకు పంచి పెట్టారు. మునగపాకలోని జగన్నాథ స్వామిని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ దర్శించుకుని పూజలు చేశారు.

ఘనంగా జగన్నాథుని మారు రథయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement