విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
● జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి మంగవేణి
అనకాపల్లి: విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్న సందర్భంగా ఆయన పర్యటన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను జిల్లా ప్రజలు వీక్షించేందుకు వీలుగా స్థానిక నెహ్రూ చౌక్‌లో డిజిటల్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డును ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం తెలిపారు. ఈ బోర్డులో ప్రధాని పర్యటన సమయం, ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు, ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన సమాచారం నిరంతరం ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని తెలుసుకుని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని వీక్షించాలని ఆమె సూచించారు.
నాతవరం: చదువుతో పాటు విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి జి.మంగవేణి సూచించారు. మర్రిపాలెం కేజీబీవీని శనివారం ఆమె ఎంపీడీవో శ్రీనివాస్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. మెనూ చార్టును, కిచెన్‌లోకి వెళ్లి కూరగాయలు, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం స్కూల్ ప్రాంగణమంతా కలియతిరిగారు. విద్యార్థినులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ. 2.12 కోట్లతో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ప్రారంభిస్తే వసతి సమస్య పరిష్కారమవుతుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీవో దాసరి కొండాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


