● ఆర్డీవో, డీఎంహెచ్‌వో
● పాఠశాలను సందర్శించిన అధికారులు
కోటవురట్ల: స్థానిక కేజీబీవీలో అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, డీఎంహెచ్‌వో డాక్టరు అచ్యుతకుమారి తెలిపారు. 30 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని హుటాహుటిన వారు కేజీబీవీకి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థి నుల ఆరోగ్య పరిస్థితి, అస్వస్థతకు గురికావడానికి గల కారణాలపై ఆరా తీశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, విద్యార్థి నులందరూ క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ప్రాణాపా యం లేదని చెప్పారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఐదు గురిని నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మిగిలిన 25 మంది విద్యార్థినులకు కేజీబీవీలోనే చికిత్స అందించినట్టు చెప్పారు. విద్యార్థినులు తీసుకున్న ఆహారం, నీటి నమూనాలను పరీక్ష నిమిత్తం పంపినట్టు తెలిపారు.
శుక్రవారం మెగా పీటీఎం జరిగిందని, ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థినుల తల్లిదండ్రు లు ఆహార పదార్థాలు తెచ్చి ఉంటారని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయిస్తున్నామని తెలిపారు. జెడ్పీటీసీ సభ్యురాలు సిద్ధాబత్తుల ఉమాదేవి అక్కడకు చేరుకుని విద్యార్థినుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కై లాసపట్నంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో చిన్నారులు మృతి చెందిన దుర్ఘటనను గుర్తు చేశారు. అధికారులు విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
మాజీ ఎమ్మెల్సీ పరామర్శ
కలుషిత ఆహారం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినులను మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ పరిశీలకుడు డి.వి.సూర్యనారాయణరాజు పరామర్శించారు. ఆయన స్థానిక సీహెచ్‌సీకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం కేజీబీవీకి వెళ్లి మిగతా విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ శ్రీరాము లు, ఎస్‌వో సరితాదేవిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.


