● 28న వాగ్దానాల అమలు కోరుతూ ర్యాలీ
● భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్
మునగపాక: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేరోజులు ఆసన్నమయ్యాయన్నారు. విద్యార్థులు, యువకులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తేదీన అనకాపల్లిలో నిర్వహించనున్న విద్యార్థి, యువత ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీఎస్సీ స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని చెప్పారు. ఏటా నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యల కారణంగా విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్నారని చెప్పారు. నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాల కారణంగా విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెరిగిపోయాయన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అనకాపల్లిలో విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్‌రాజా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ర్యాలీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీఎంగా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హేమంత్‌కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌తో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల విద్యార్థి, యువజన విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.


