తాళపత్రాలకు నవ వైభవం
అక్షర సేద్యంలో ‘క్షీర సాగర్’ మథనం
సవాళ్లను అధిగమించి సాధించిన అమృతం క్షీర సాగరాన్ని మథిస్తే అమృతం లభించినట్లుగానే, తన మనసును మథించిన క్షీర సాగర్.. తాటాకుపై అక్షరాలను లిఖించే విధానాన్ని నేటి కాలానికి అనుగుణంగా మార్చారు. పూర్వం తాటాకుపై ఘంటంతో రాసేవారు. ఆ విద్య తెలిసిన వారు ఇప్పుడు కరువవడంతో, ఆయన ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించారు. ఢిల్లీలో జరిగిన ప్రింటింగ్ ఎగ్జిబిషన్‌లో ఒక లేజర్ మిషన్‌ను చూసిన ఆయనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. నేమ్ బోర్డుల తయారీకి వాడే ఆ యంత్రాన్ని తాటాకుపై అక్షరాల ముద్రణకు వీలుగా మార్పులు చేశారు. ఎన్నో ప్రయోగాల తర్వాత అత్యంత స్పష్టంగా అక్షరాలను ముద్రించడంలో విజయం సాధించారు.
ప్రాచీనతకు ఆధునికత మేళవించి....
విజయనగరం జిల్లా ఎల్.కోట పరిసరాల నుంచి సేకరించిన తాటాకులను శుభ్రం చేసి, నిర్ణీత కొలతల్లో కత్తిరిస్తారు. వాటిపై లేజర్ సాయంతో ఆధ్యాత్మిక స్తోత్రాలు, శ్లోకాలు, దేవతా రూపాలను ముద్రిస్తారు. ఈ తాళపత్రాలు ఏళ్ల తరబడి పాడవకుండా పసుపు, ప్రత్యేకమైన కోటింగ్ వేస్తారు. వీటిని చూడగానే పాతకాలపు జ్ఞాపకాలు గుర్తుకు రావడమే కాకుండా, చదవడానికి ఎంతో సులువుగా ఉంటున్నాయి. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం, గాయత్రి మంత్రం వంటి వాటిని తాళపత్రాల రూపంలో సిద్ధం చేసి అపురూప బహుమతులుగా అందిస్తున్నారు.
నాటి ప్రధాని చేతుల మీదుగా అవార్డు...
ప్రధాని చేతుల మీదుగా ‘శ్రమ శ్రీ’ క్షీర సాగర్ ప్రతిభ కేవలం ఈ కళకే పరిమితం కాలేదు. గతంలో నేవల్ డాక్‌యార్డ్‌లో పనిచేసిన ఆయన.. వృత్తి పట్ల చూపిన అంకితభావానికి 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయ్ చేతుల మీదుగా ‘శ్రమ శ్రీ’ అవార్డును అందుకున్నారు. అలాగే నావికాదళ అధికారుల నుంచి అనేక ప్రశంసలు పొందారు. సాహస యాత్రలు, ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటి అభిరుచులతో పాటు అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించి సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
తాటాకుపై ఆహ్వాన పత్రిక
మార్పు తన ఇంటి నుంచే మొదలవ్వాలని భావించిన సాగర్, తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రాలను తాటాకుపైనే ముద్రించి అతిథులను ఆశ్చర్యపరిచారు. పెళ్లికి వచ్చిన వారికి మొక్కలను బహుమతిగా ఇచ్చి ప్రకృతిపై తనకు న్న ప్రేమను చాటుకున్నారు. చివరికి తన పదవీ విరమణ రోజున కూడా 500 పండ్ల మొక్కలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో తనవంతు పాత్ర పోషించారు. కనుమరుగవుతున్న తాళపత్ర కళను నేటి తరానికి చేరువ చేస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ ఆయన సాగిస్తున్న ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం.
నేటి డిజిటల్ యుగంలో అక్షరం కాగితంపై నుంచి తెరపైకి మారిపోయింది. పుస్తకం కంటే స్మార్ట్‌ఫోనే ప్రాణప్రదంగా మారిన ఈ కాలంలో మన పూర్వీకుల అపార జ్ఞాన నిధులైన తాళపత్రాల (తాటాకు గ్రంథాలు) గురించి నేటి తరానికి అసలు అవగాహనే లేదు. అపారమైన వారసత్వ సంపదగా విరాజిల్లిన ఈ తాళపత్ర కళ కనుమరుగవుతున్న తరుణంలో, దానికి ఆధునిక సొబగులు అద్ది పునర్జీవం పోస్తున్నారు నగరానికి చెందిన కేశవరాజు క్షీర సాగర్. ప్రకృతిపై మమకారం, సంస్కృతిపై గౌరవం ఆయనను ఈ వినూత్న మార్గంలో నడిపించాయి. –ఏయూక్యాంపస్
తాటాకుపై లిఖించిన గోవింద నామాలు
నేటి తరానికి తెలియజేయాలని..
శతాబ్దాలుగా మన దేశంలో ఉన్న తాళపత్రాలు నేటి తరానికి తెలియజేయాలనే ప్రయత్నించా. మన సంస్కృతి, ప్రకృతితో ముడిపడిన మన జీవన విధానం నేటి యువతకు పరిచయం చేస్తున్నా.. భవిష్యత్తులో అనేక గ్రంథాలను తాళపత్రాలపై ముద్రించాలనే ఆలోచన ఉంది. మరుగున పడిపోతున్న కళను సంరక్షించడం, ఆధునికతను దానికి జోడించే చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఎంతో ఓపికతో సమయం తీసుకుని వీటిని సిద్ధం చేయాల్సి ఉంటుంది. మా కుటుంబలో జరిగే అన్ని శుభకార్యాలకు తాటాకుతో చేసిన ఆహ్వానాలు అందిస్తున్నాం. వీటిని తీసుకున్నవారు కూడా ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకుంటున్నారు. –కె. క్షీర సాగర్, అక్కయ్యపాలెం
తాళపత్రాలకు నవ వైభవం
తాళపత్రాలకు నవ వైభవం


