కొత్త వసంతం తీపిని పంచేనా..? | - | Sakshi
Sakshi News home page

కొత్త వసంతం తీపిని పంచేనా..?

Jan 2 2026 11:18 AM | Updated on Jan 2 2026 11:18 AM

కొత్త

కొత్త వసంతం తీపిని పంచేనా..?

సాక్షి, అనకాపల్లి : అనకాపల్లి బెల్లం మార్కెట్‌ అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో బెల్లం కొనుగోళ్ల విషయంలో వ్యాపారులు పోటీ పడి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసేవారు. దేశంలో చాలా రాష్ట్రాలు బెల్లం తయారు చేస్తున్నప్పటికీ అనకాపల్లి బెల్లంకు మిగిలినవి సాటిరావనేది నిత్య సత్యం.. రంగు, రుచిలో ప్రత్యేకత కలిగిన అనకాపల్లి దేశంలో రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్‌ యార్డుగా అనకాపల్లి బెల్లం మార్కెట్‌ ప్రసిద్ధి చెందింది. గత పదేళ్లగా చెరకు సాగు తగ్గడం వల్ల ఉత్పత్తి, అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో సహకార సుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడడం..సాగు ఖర్చు పెరిగిపోవడం, రైతులు స్థానికంగా అమ్మకాలు సాగిస్తుండడంతో మార్కెట్‌కు వచ్చే దిమ్మల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రతి ఏటా డిసెంబర్‌ నుంచి సీజన్లో సుమారు 45 లక్షల వరకూ బెల్లం దిమ్మలు మార్కెట్‌కు వచ్చేవి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి బెల్లం ఎగుమతి అవుతుంది. ప్రస్తుత సీజన్‌లో ఇందుకు విరుద్ధంగా వరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు బెల్లం దిగుబడి గణనీయంగా పడిపోగా..ధర మరీ దారుణంగా పతనమైంది. తయారు చేసే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ విధానాలు, ప్రకృతి వైపరీత్యాలు ఏటా దెబ్బతీస్తున్నాయి. గత సీజన్‌లో కేవలం 7.33 లక్షల దిమ్మలు మాత్రమే మార్కెట్‌కు రావడం ఆందోళనకరంగా మారింది. వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న అనకాపల్లి మార్కెట్లో ఇంత తక్కువ స్థాయిలో బెల్లం దిమ్మలు రావడం ఇదే తొలిసారి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక నెలలోనే 10 లక్షలు పైగా దిమ్మల అమ్మకాలు జరిగాయి. అటువంటిది ఏడాది పొడవునా 7 లక్షల దిమ్మలు రాలేదంటే మార్కెట్‌ ఏ విధంగా పతనమౌతుందో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్వింటాలు బెల్లంకు ఐదువేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేయడమే ఈ బెల్లం సంక్షోభానికి ప్రధాన కారణం అంటున్నారు చెరకు రైతులు. క్వింటాలుకు ఐదువేల రూపాయల మద్దతు ధర ప్రభుత్వం ప్రకటిస్తే రైతులు మళ్లీ చెరకు పంట సాగు చేసే అవకాశం ఉంది. భారీగా చెరకు సాగు జరిగితే అనకాపల్లి బెల్లం మార్కెట్‌ కళకళలాడే అవకాశం ఉంది. లేకుంటే అనకాపల్లి బెల్లం అనేది భవిష్యత్తులో ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.

సేంద్రియ బెల్లంపై దృష్టి సారించాలి..

రెండేళ్లుగా అనకాపల్లి నుంచి ఇతర రాష్ట్రాలకు బెల్లం ఎగుమతి అయ్యే పరిస్థితి నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చింది. దీంతో బెల్లం రైతులను చైతన్యపర్చేందుకు మార్కెట్‌ అధికారులు సైతం రంగంలో దిగుతున్నా రైతులు ఆసక్తి చూపడం లేదు. తమకు గిట్టుబాటు ధర లేదంటూ వాపోతున్నారు. అందుకే సేంద్రియ బెల్లం తయారీపై ఎక్కువ దృష్టి సారించాలని చూస్తున్నారు. ఇప్పటికే అనకాపల్లి నుంచి సేంద్రియ బెల్లం, బెల్లం ఉత్త్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సేంద్రియ బెల్లంకు గిరాకీ పెరగడంతో ఆ వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పిస్తున్నారు.

గిట్టుబాటు లేక...

జిల్లాలో అనకాపల్లి, కశింకోట, యలమంచిలి, మునగపాక, చోడవరం, మాడుగుల, కోటవురట్ల మండలాల్లో బెల్లం తయారు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న నాలుగు చక్కెర కర్మాగారాలు మూతపడడం.. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో చెరకు రైతులు చెరకు సాగుకు దూరంగా ఉంటున్నారు. బెల్లంకు కూడా గిట్టుబాటు ధర లేకపోవంతో పూర్తిగా సాగు తగ్గిపోయింది. జిల్లా వ్యాప్తంగా పదేళ్ల క్రితం సుమారుగా 90 వేల నుంచి 1 లక్ష ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. ఇపుడు 15 వేల ఎకరాలకు పడిపోయింది. అనకాపల్లి మార్కెట్‌లో నల్లబెల్లంపై ఎకై ్సజ్‌ శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తుండడంతో రైతులలో ఆందోళన రేకెత్తుతోంది. సహజంగా భూసారం వల్ల బెల్లం నల్లరంగులో మారుతుంది. సారా తయారీకి నల్లబెల్లం వాడుతున్నారనే కేసులు నమోదు కావడంతో వ్యాపారులు ఈ బెల్లం కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదు. గిట్టుబాటు ధర లేకపోవడంతో బెల్లం తయారీ కూడా తగ్గుముఖం పడుతూ వచ్చింది. 2023–24 సీజన్‌లో సగటున 100 కేజీల బెల్లం ధర రూ.3,901 ఉంటే, 2024–25 సీజన్లో రూ.3,811కు పడిపోయింది. ఖర్చులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. గత సీజన్‌లో 100 కేజీల బెల్లం తయారీకి 1,200 రూపాయలు ఖర్చు కాగా, ముగిసిన సీజన్‌లో 1,400 రూపాయలకు పెరిగింది.

బెల్లం వ్యాపారులు, సిబ్బంది తగ్గారు..

గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ క్రషర్‌ ఆగిపోవడంతో రైతులు చెరకు సాగు తగ్గించారు. దీంతో బెల్లం తయారీ కూడా తగ్గింది. గతేడాది 7.5 లక్షల బెల్లం దిమ్మలు వచ్చాయి. ఈ ఏడాది మరింత తగ్గే అవకాశం ఉంది. 2023లో అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు 15 లక్షల దిమ్మలు వచ్చాయి. అనకాపల్లి బెల్లం మార్కెట్లో మూడు యూనియన్లు ఉన్నాయి. ఒక్కో యూనియన్‌లో 500 మంది కార్మికులు పనిచేసేవారు. ప్రస్తుతం కొలగాలు కళాసిలో సుమారుగా 250 మంది పని చేస్తు న్నారు. మహిళా కార్మికులు 80 నుంచి 30 మందికి తగ్గారు. గతంలో బెల్లం వ్యాపారులు 25 మంది వరకు ఉండేవారు. ప్రస్తుతం 10 మంది మాత్రమే చేస్తున్నారు. 15 మంది ఖాళీగా ఉన్నారు.

– పొలిమేర శివ అప్పారావు, కార్మిక సంఘం నాయకుడు, ఎన్టీఆర్‌ బెల్లం మార్కెట్‌

కుదేలవుతున్న బెల్లం పరిశ్రమ

భారీగా తగ్గిన చెరకు ఉత్పత్తి

రెండేళ్లుగా తగ్గిన బెల్లం విక్రయాలు

గత సీజన్‌లో మార్కెట్‌లోకి కేవలం 7.33 లక్షలు బెల్లం దిమ్మలు

చంద్రబాబు సర్కారులో గిట్టుబాటు ధర లేకపోవడమే కారణం

గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో నెలకు 10 లక్షల బెల్లం దిమ్మల విక్రయాలు

ప్రస్తుతం 100 కిలోల బెల్లం ధర రూ.3,811కు తగ్గింపు

గణనీయంగా తగ్గుతున్న బెల్లం అమ్మకాలు

చంద్రబాబు సర్కార్‌లో బెల్లం దిమ్మల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. 2014–19లో బెల్లం మార్కెట్‌కు పతనం ప్రారంభమైంది. ఆ తరువాత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రావడంతో కాసింత గిట్టుబాటు ధర కల్పించడం..బెల్లం తయారీ దారులకు, చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నారు. ఆ తరువాత వచ్చిన చంద్రబాబు సర్కార్‌లో ఇటు బెల్లం మార్కెట్‌, అటు చెరకు సాగు, చెరకు సాగు చేసే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చంద్రబాబు చేసిన నిర్వాకంతో పూర్తిగా చెరకు సాగు, బెల్లం తయారీ తగ్గుముఖం పట్టాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏడాదికి 16.85 లక్షల దిమ్మలు అమ్ముడుపోగా.. 2024–25లో 7.52 లక్షల బెల్లం దిమ్మల అమ్మకాలు జరిగాయి.

కొత్త వసంతం తీపిని పంచేనా..? 1
1/2

కొత్త వసంతం తీపిని పంచేనా..?

కొత్త వసంతం తీపిని పంచేనా..? 2
2/2

కొత్త వసంతం తీపిని పంచేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement