ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకల్లో కేక్ కట్ చేస్తున్న
ఎస్పీ తుహిన్ సిన్హా . చిత్రంలో అడిషనల్ ఎస్పీలు దేవప్రసాద్, ఎల్.మోహన్‌రావు
సబ్బవరం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలసి కేక్ కట్ చేస్తున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కలెక్టర్ విజయకృష్ణనన్‌కు జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ప్రజల సహకారం, అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆమె తెలిపారు. నూతన సంవత్సరంలో జిల్లాకు శాంతి, సుభిక్షం, సమృద్ధి తీసుకురావాలని, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో కీలకమని, శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో
అనకాపల్లి : జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కేక్ కట్ చేసి, పోలీసు అధికారులకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా ఎస్పీని జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల అధికారులు డి.విష్ణు స్వరూప్, పి. శ్రీనివాసరావు, ఎం.శ్రావణి, డీఎస్పీలు జి.ఆర్.ఆర్.మోహన్, బి.మోహనరావు, ఈ.శ్రీనివాస్, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్‌ఐలు కూడా ఉన్నతాధికారులను కలిసి అభినందనలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో జిల్లా పోలీసు యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీఐజీకి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, విశాఖ నగర సీపీ శంఖబ్రత భాగ్చీని గురువారం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
చోడవరం : మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాధ్ తన స్వగృహంలో కేక్ కట్‌చేసి స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. పలువురు పార్టీ నాయకులు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
గురుకుల పాఠశాలలో కలెక్టర్
సబ్బవరం: విద్యార్థులంతా క్రమశిక్షణ అలవరుచుకుని ఉన్నత విద్యావంతులు కావాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆకాంక్షించారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను గురువారం సందర్శించి విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు.
స్వీట్‌లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే ప్రభుత్వ ఉద్యోగులంతా తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలన్నారు. గురుకుల పాఠశాలకు వచ్చిన కలెక్టర్‌కు స్థానిక తహసీల్దార్ బి.చిన్నికృష్ణ, ఎంపీడీవో పద్మజ తదితరులు గురుకుల అధ్యాపకులతో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, స్వాగతం పలికారు.
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు


